పదేళ్లు ఢిల్లీలో అధికారంలో ఉండి కూడా ఢిల్లీలో నీటి సమస్య, మురుగు సమస్య, గుంతల రోడ్ల సమస్యలను పరిష్కరించలేకపోయామని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తన ప్రసంగంలో ఒప్పుకున్నారంటూ ఒక వీడియో (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.
క్లెయిమ్: ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఢిల్లీలో నీరు, మురుగు సమస్య, రోడ్ల సమస్యలను పరిష్కరించలేదని ఒప్పుకున్న అరవింద్ కేజ్రీవాల్.
ఫాక్ట్: ఇది క్లిప్ చేయబడిన వీడియో. పూర్తి వీడియోలో ఢిల్లీలోని విశ్వాస్ నగర్ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే ఓం ప్రకాష్ శర్మను ఉద్దేశిస్తూ కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఓం ప్రకాష్ శర్మ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో విశ్వాస్ నగర్ లో త్రాగునీరు, మురుగు నీరు, రోడ్ల సమస్యకు ఎటువంటి పరిష్కారం దొరకలేదని, మేము సాయం చేయడానికి ముందుకు వచ్చినా ఆయన నిరాకరించాడని కేజ్రీవాల్ పేర్కొన్నారు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.
ముందుగా వైరల్ వీడియోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, దీనికి సంబంధించిన పూర్తి వీడియో 20 జనవరి 2025న ఆమ్ ఆద్మీ పార్టీ అధికారిక యూట్యూబ్ ఛానెల్లో అప్లోడ్ చేసినట్లు గుర్తించాం. 05 ఫిబ్రవరి 2025న జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఢిల్లీలోని విశ్వాస్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన సభలో కేజ్రీవాల్ చేసిన ప్రసంగాన్ని ఈ వీడియోలో చూడవచ్చు.
విశ్వాస్ నగర్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి దీపక్ సింఘాల్‌కు మద్దత్తు తెలుపుతూ 25:10 నిమిషాల వద్ద ప్రజలను ఉద్దేశిస్తూ కేజ్రీవాల్ ఈ విధంగా అన్నారు, “మీ అందరికీ చేతులు జోడించి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. గత ఎన్నికలలో (2020) తప్పు జరిగింది. మేము పోటీ చేసిన 70 సీట్లలో 62 చోట్ల గెలిచాము. ఓడిపోయిన ఎనిమిది సీట్లలో విశ్వాస్ నగర్ కూడా ఉంది. మీరు గత ఎన్నికలలో ఆ పార్టీ(బీజేపీ) అభ్యర్థిని (ఓం ప్రకాష్ శర్మ) గెలిపించారు. ఆయన (ఓం ప్రకాష్ శర్మ) గత పదేళ్లుగా మాతో విభేదిస్తూ వస్తున్నారు. కానీ తన నియోజకవర్గంలో ఎటువంటి పని చెయ్యలేదు. నేనేం తప్పు చెప్పట్లేదు. ఇప్పుడే నాకు తెలిసింది… ఈ నియోజకవర్గంలోని అన్ని కాలనీలలో త్రాగునీటి సమస్య ఉందని తెలిసింది… అవునా? కాదా? ప్రతి కాలనీలో మురుగు నీటి సమస్య ఉంది… అవునా? కాదా? రోడ్లు గుంతలు పడి ఉన్నాయి… అవునా? కాదా? నియోజకవర్గం మొత్తం చెత్తాచెదారంతో నిండిపోయింది… అవునా? కాదా? సీసీ కెమెరాలు పెట్టమని, మొహల్లా క్లినిక్స్ ఏర్పాటు చేయమని నేను అతనికి (ఓం ప్రకాష్ శర్మ) చాలా సార్లు చెప్పాను. మేము తాగునీటి సౌకర్యం కల్పించడానికి మేం (ఆప్ ప్రభుత్వం) ముందుకి వచ్చినా అతను స్వీకరించలేదు. కాబట్టి, మీరు ఆలోచించండి. వచ్చే ఐదేళ్లలో గొడవలు, కొట్లాటలు కావాలంటే అతనికి ఓటెయ్యండి. అభివృద్ధి కావాలంటే ఇతనికి (దీపక్ సింఘాల్) ఓటెయ్యండి.” దీనికి సంబంధించిన వార్తా కథనాలను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్లో ఇచ్చిన వివరాల ప్రకారం, 2025 ఢిల్లీ ఎన్నికల్లో విశ్వాస్ నగర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా ఓం ప్రకాష్ శర్మ పోటీ చేస్తున్నారు. 2013 నుంచి ఈ నియోజకవర్గంలో బీజేపీ నుంచి ఓం ప్రకాష్ శర్మ ఎమ్మెల్యేగా ఉన్నారు. పై ఆధారాల బట్టి, వైరల్ వీడియోలో కేజ్రీవాల్ విశ్వాస్ నగర్ ఎమ్మెల్యే ఓం ప్రకాష్ శర్మను విమర్శిస్తూ మాట్లాడారని స్పష్టం అవుతుంది.
చివరిగా, ఢిల్లీలో పదేళ్లుగా ఎటువంటి మౌలిక సదుపాయాలను కల్పించలేదని కేజ్రీవాల్ ఒప్పుకున్నట్లు క్లిప్ చేయబడ్డ వీడియోని షేర్ చేస్తున్నారు.