అసంపూర్ణ వీడియోని షేర్ చేస్తూ మోదీని ఇతర నేతలు పట్టించుకోలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారు

ఇటీవల జపాన్‌లో జరిగిన G7 సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న నేపథ్యంలో, వివిధ దేశాల నాయకులు గ్రూప్ ఫోటో దిగుతున్న సమయంలో మోదీని ఎవరూ పట్టించుకోలేదని చెప్తూ ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: జపాన్‌లో జరిగిన G7 సదస్సులో వివిధ దేశాల నాయకులు గ్రూప్ ఫోటో దిగుతున్న సమయంలో మోదీని ఎవరూ పట్టించుకోలేదు.

ఫాక్ట్: ఈ కార్యక్రమం పూర్తి వీడియోలో ప్రధాని మోదీతో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కలిసి రావడం చూడవచ్చు. అలాగే జపాన్ ప్రధాని ఫుమియో కిషీదా కరచాలనం చేస్తూ మాట్లాడారు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ముందుగా ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వీడియోను పరిశీలించగా, ప్రధాని మోదీతో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కలిసి రావడం చూడవచ్చు. అలాగే, ఫోటో సెషన్ పూర్తయ్యాక, మోదీతో కరచాలనం చేస్తూ జపాన్ ప్రధాని ఫుమియో కిషీదా మాట్లాడటం కూడా చూడవచ్చు.

ఇక ఈ పర్యటనలో మోదీ వివిధ దేశాల నాయకులను కలిసినప్పుడు తీసిన ఫొటోలను ఇక్కడ చూడవచ్చు.

చివరిగా,  అసంపూర్ణ వీడియోని షేర్ చేస్తూ G7 సదస్సులో మోదీని ఇతర నేతలు పట్టించుకోలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.