ఇటీవల ఏపీ సీఎం వై.ఎస్. జగన్‌పై జరిగిన దాడిపై కొడాలి నాని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు అంటూ ఒక క్లిప్ చేసిన వీడియోను షేర్ చేస్తున్నారు

ఇటీవల 13 ఏప్రిల్ 2024న వైసీపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడలో నిర్వహించిన రోడ్ షోలో ఏపీ సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై రాయితో దాడి జరిగింది. ఈ నేపథ్యంలో ఆ దాడి ఘటనపై ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు కొడాలి నాని స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు అంటూ వీడియో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కొడాలి నాని “పర్యటనకి వెళ్తుంటే ఎంత మంది పోలీసులు పహారాలో అతని యాత్ర నడుస్తుంది, ఎవడో చీకట్లో రాయి విసిరాడు అంట ఈడి మీదకి, వీన్ని చంపేద్దాం అని చెప్పి, ఎంత ఇంత గులకరాయి, ఈయన ఏమైనా పావురమా ? పిట్టా ? గులకరాయి పెట్టి కొడితే పోవడానికి, ఎవడు విసురుతాడు, పక్కింటి హీరోని తీసుకొచ్చి అందలం ఎక్కాలి అని చూస్తున్నావు కాబట్టి నీ తాలుక ఎవడో విసిరి ఉంటాడు, ఆయనే, ఆయన పార్టీ కార్యకర్తలతో గులకరాళ్లు వేయించుకోవడం” అని మాట్లాడం మనం చూడవచ్చు .ఈ కథనం ద్వారా ఆ వీడియోకు సంబంధించి నిజేమెంటో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: 13 ఏప్రిల్ 2024న విజయవాడలో ఏపీ సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పై జరిగిన దాడి ఘటన పై వైసీపీ నాయకుడు కొడాలి నాని స్పందిస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): నవంబర్ 2022లో నందిగామలో చంద్రబాబు రోడ్ షో పై జరిగిన రాళ్లదాడి ఘటనపై అప్పట్లో కొడాలి నాని స్పందిస్తున్న వీడియోలోని కొంత భాగాన్ని క్లిప్ చేసి ఇటీవల ఏపీ సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి గురించి కొడాలి నాని అన్నట్లు షేర్ చేస్తున్నారు. వాస్తవంగా, కొడాలి నాని చంద్రబాబు నాయుడును ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

13 ఏప్రిల్ 2024న ఏపీ సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి ఘటనపై  వైసీపీ నాయకుడు కొడాలి నాని స్పందిస్తూ ఇలాంటి వ్యాఖ్యలు ఏవీ చేయలేదు. కొడాలి నాని ఈ దాడి ఘటనను ఖండిస్తూ, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రేరణతోనే టీడీపీ కార్యకర్తలు ఏపీ సీఎం వై.ఎస్. జగన్ పై దాడి చేసారని అన్నారు (ఇక్కడ & ఇక్కడ).

నవంబర్ 2022లో ఎన్టీఆర్ జిల్లా నందిగామలో జరిగిన టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షోపై రాళ్లదాడి జరిగింది (ఇక్కడ & ఇక్కడ). ఈ వైరల్ వీడియోలోని దృశ్యాలు ఈ ఘటనపై అప్పట్లో కొడాలి నాని స్పందిస్తూ చంద్రబాబే రాళ్లు వేయించుకుని ఉంటారని ఆరోపిస్తున్న దృశ్యాలను చూపిస్తున్నది.

ఈ వైరల్ వీడియో కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని 06 నవంబర్ 2022న ‘ETV Andhra Pradesh ’ తమ అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో “TDP Leader Devineni Uma Serious On Kodali Nani Comments | During Chandrababu Nandigama Visit” అనే శీర్షికతో పబ్లిష్ చేసినట్టు తెలిసింది.

ఈ వీడియోని పూర్తిగా పరిశీలిస్తే, వైరల్ వీడియో క్లిప్పింగ్ లోని దృశ్యాలు  టైంస్టాంప్ 00:16 వద్ద మొదలై, టైంస్టాంప్ 00:42  వద్ద ముగుస్తాయి అని తెలిసింది. వాస్తవంగా, కొడాలి నాని మాట్లాడుతూ “చంద్రబాబు నాయుడు గారు పర్యటనకి వెళ్తుంటే ఎంత మంది పోలీసులు పహారాలో అతని యాత్ర నడుస్తుంది, ఎవడో చీకట్లో రాయి విసిరాడు అంట ఈడి మీదకి, వీన్ని చంపేద్దాం అని చెప్పి, ఎంత ఇంత గులకరాయి, ఈయన ఏమైనా పావురమా ? పిట్టా ? గులకరాయి పెట్టి కొడితే పోవడానికి, ఎవడు విసురుతాడు, పక్కింటి హీరోని తీసుకొచ్చి అందలం ఎక్కాలి అని చూస్తున్నావు కాబట్టి నీ తాలుక ఎవడో విసిరి ఉంటాడు, ఆయనే, ఆయన పార్టీ కార్యకర్తలతో గులకరాళ్లు వేయించుకోవడం” అని అన్నారు. దీన్ని బట్టి నవంబర్ 2022లో నందిగామలో చంద్రబాబు రోడ్ షోపై జరిగిన రాళ్లదాడి ఘటనపై అప్పట్లో కొడాలి నాని స్పందిస్తున్న వీడియోలోని కొంత భాగాన్ని క్లిప్ చేసి ఇటీవల ఏపీ సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి గురించి కొడాలి నాని అన్నట్లు షేర్ చేస్తున్నారు అని నిర్ధారించవచ్చు. వాస్తవంగా, కొడాలి నాని చంద్రబాబు నాయుడును ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు.

చివరగా, 13 ఏప్రిల్ 2024న  ఏపీ సీఎం వై.ఎస్. జగన్ పై జరిగిన దాడి గురించి కొడాలి నాని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు అంటూ ఒక క్లిప్ చేసిన వీడియోను షేర్ చేస్తున్నారు.