తెలుగుదేశం కూటమి ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని 2022 నాటి వీడియోని షేర్ చేస్తున్నారు

డిసెంబర్‌లో 2024లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించిన విద్యుత్ ధరల పెంపు నేపథ్యంలో ఒక TV5 న్యూస్ రిపోర్ట్ వీడియో సోషల్ మీడియాలో (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) వైరల్ అవుతోంది.  ఇందులో ఒక TV 5 న్యూస్ జర్నలిస్ట్ రాష్ట్రంలోని విద్యుత్ ధరల పెంపు గురించి ప్రజలతో మాట్లాడుతుండగా, ప్రజలు పెరుగుతున్న ధరలపై తమ ఆందోళనను వ్యక్తం చేస్తూ కనిపిస్తున్నారు. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం. 

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: డిసెంబర్ 2024లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ ధరల పెంపుపై ప్రజలు ఆందోళనను వ్యక్తం చేస్తున్న వీడియో.

ఫాక్ట్(నిజం): ఈ వీడియో మే 2022 లో, కర్నూలు జిల్లాలోని విద్యుత్ ఆఫీసులో TV5 News జర్నలిస్టు ప్రజలతో మాట్లాడినప్పటిది. ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ) ఉన్నారు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.

వైరల్ వీడియోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, దీనికి సంబంధించిన పూర్తి వీడియో (ఆర్కైవ్ లింక్) మాకు లభించింది. ఈ వీడియో 09 మే 2022న TV5 News యూట్యూబ్ ఛానెల్లో“ ఏపీలో విద్యుత్ బిల్లుల బాదుడుపై ప్రజల స్పందన | Public on AP current bill hike | TV5 News”  అనే శీర్షికతో ప్రచురించబడింది. ఏప్రిల్ 2022లో (ఆర్కైవ్ లింక్) అప్పటి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం విధించిన నూతన విద్యుత్ ఛార్జీలపై ప్రజల స్పందనను ఈ వీడియో చూపుతుంది. ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ( వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ) ఉన్నారు. 

వైరల్ వీడియోలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫోటోను మార్చి, సీఎం చంద్రబాబు నాయుడు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోను ఎడిట్ చేసి పెట్టినట్లు చూడవచ్చు.

అదనంగా,  ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ వింగ్ వైరల్ వీడియోని ఖండించింది (ఆర్కైవ్ లింక్). వీడియోలో ఫోటోలు మార్ఫ్ చేయబడ్డాయని, ఇది 9 మే 2022న ఉన్న వీడియో అని తెలిపింది. తప్పుడు ప్రచారం చేసిన వారిపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని పేర్కొంది.

చివరిగా, తెలుగుదేశం కూటమి ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని 2022 నాటి వీడియోని షేర్ చేస్తున్నారు.