2022లో బీహార్‌లోని సీతామర్హిలో రైల్వే పరీక్షలో అవకతవకలు జరిగాయిని విద్యార్థులు చేసిన నిరసనకు సంబంధించిన వీడియోను మతపరమైన కోణంతో షేర్ చేస్తున్నారు

“ముస్లింలు రైల్వే పట్టాలను ధ్వంసం చేస్తున్న దృశ్యాలు” అంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ వీడియోలో, ఒక యువకుడు రైల్వే ట్రాక్‌ను ధ్వంసం చేయడాన్ని మనం చూడవచ్చు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ముస్లింలు రైల్వే పట్టాలను ధ్వంసం చేస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియో జనవరి 2022లో బీహార్‌లోని  సీతామర్హిలో రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ (NTPC) పరీక్షలో అవకతవకలు జరిగాయిని విద్యార్థులు చేసిన నిరసనకు సంబంధించినది. భారత రైల్వే వారు కూడా వారి అధికారిక ఫేస్‌బుక్‌ ఖాతాలో ఇది పాత వీడియో అని , పుకార్లను నమ్మవద్దని పోస్ట్ చేసారు. ఈ వైరల్ వీడియోలో రైల్వే పట్టాలు ధ్వంసం చేస్తున్న వ్యక్తి ఏ మతానికి చెందినవాడో మేము ఖచ్చితంగా చెప్పలేము. కానీ అందుబాటులో ఉన్న ఆధారాలను బట్టి ఈ సంఘటనకు మతపరమైన కోణం లేదని స్పష్టమవుతోంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఈ వైరల్ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం, వైరల్ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే వీడియోను (ఆర్కైవ్డ్ లింక్) 27 జనవరి 2022న  ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి అజయ్ సెహ్రావత్ తన X(ట్విట్టర్) ఖాతాలో షేర్ చేసినట్లు మేము కనుగొన్నాము. “ఈ పెద్దమనిషి రైల్వేలో ఉద్యోగానికి దరఖాస్తుదారుడు” అనే క్యాప్షన్‌తో వీడియో షేర్ చేయబడింది (హిందీలో నుండి తెలుగులోకి అనువదించగా). ఈ వీడియో యొక్క కామెంట్స్ విభాగంలో, పలువురు ఈ వీడియో బీహార్ కు చెందినది అని పేర్కొనడం మేము గమనించాము.

అలాగే ఇవే దృశ్యాలు కలిగి ఉన్నఅధిక నిడివి గల వీడియోను మీడియా సంస్థ న్యూస్ 18 బీహార్ తన X(ట్విట్టర్)లో 27 జనవరి 2022న, “ఆందోళన చేస్తున్న విద్యార్థులు రైల్వే ట్రాక్ స్లీపర్ తాళాలను ఎలా పగలగొడుతున్నారో చూడండి. సీతామర్హి వీడియో వైరల్ అవుతోంది” అనే క్యాప్షన్‌తో షేర్ చేసినట్లు గుర్తించాము (హిందీలో నుండి తెలుగులోకి అనువదించగా). అలాగే, న్యూస్ 18 బీహార్ జార్ఖండ్ యూట్యూబ్ ఛానెల్‌లో ఈ ఘటనకు సంబంధించిన వీడియో 27 జనవరి 2022న షేర్ చేయబడింది.

తదుపరి ఈ సమాచారం ఆధారంగా ఈ సంఘటన/వీడియోకు సంబంధించిన పూర్తి వివరాల తెలుసుకోవడానికి తగిన కీవర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్‌లో వెతికగా, వైరల్ వీడియోలో ఉన్న దృశ్యాలనే రిపోర్ట్ చేస్తూ 27 జనవరి 2022న ETV భారత్ ప్రచురించిన వార్త కథనం లభించింది. ఈ కథనం ప్రకారం, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ (NTPC) పరీక్షా ఫలితాల్లో అవకతవకలు జరిగాయిని విద్యార్థులు నిర్వహించిన నిరసన సందర్భంగా, బీహార్‌లోని సీతామర్హిలో విద్యార్థులు రైల్వే ట్రాక్‌ను ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో, నిరసనకారులకు, పోలీసులకు మధ్య హింసాత్మక ఘర్షణ జరిగింది. సీతామర్హి రైల్వే స్టేషన్ స్టేషన్ సూపరింటెండెంట్‌ను ఈ ఘటన ఎక్కడ జరిగింది అని ETV భారత్ అడగగా, ఈ ఘటన సీతామర్హి జిల్లాలో ఎక్కడ జరిగిందో కచ్ఛితంగా తనకు తెలియదని అన్నారని ఈ కథనం పేర్కొంది.

రిపోర్ట్స్ ప్రకారం (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ), జనవరి 2022లో, బీహార్‌లో రైల్వే ఉద్యోగాలకు సిద్ధమవుతున్న విద్యార్థులు RRB NTPC పరీక్షలో అక్రమాలు జరిగాయిని రాష్ట్ర వ్యాప్తంగా భారీ నిరసనలు చేపట్టారు. ఈ నిరసనల సందర్భంగా, బీహార్‌లోని అనేక ప్రాంతాల్లో హింస, దహనం, విధ్వంస సంఘటనలు జరిగాయి. పాట్నా, గయా, అరా, నవాడా, నలంద, ముజఫర్‌పూర్, సీతామర్హి రైల్వే స్టేషన్లపై విద్యార్థులు దాడులు చేశారు. గయా జంక్షన్ వద్ద , నిరసన తెలుపుతున్న విద్యార్థులు ఖాళీ రైలు కంపార్ట్‌మెంట్‌కు నిప్పు పెట్టి, రాళ్లు రువ్వారు. ఈ నిరసనలలో విద్యార్థులు నవాడాలో రైల్వే ట్రాక్ నిర్వహణ ఇంజిన్ దగ్ధం చేశారు. చాలా చోట్ల పోలీసులకు, విద్యార్థులకు మధ్య ఘర్షణలు జరిగాయి, విద్యార్థులను చెదరగొట్టడానికి పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ ఫిరంగి, లాఠీచార్జ్ ప్రయోగించారు. ఈ సంఘటన తర్వాత, రైల్వే మంత్రిత్వ శాఖ పరీక్షలను తాత్కాలికంగా నిలిపివేసి, అభ్యర్థుల ఫిర్యాదులను పరిశీలించడానికి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపింది. రిపోర్ట్స్ ప్రకారం, ఈ నిరసనలు ఉత్తరప్రదేశ్‌లో కూడా జరిగాయి. ఈ కథనాలు ఏవీ కూడా ఈ నిరసనలో మతపరమైన కోణం ఉన్నట్లు పేర్కొనలేదు. అలాగే బీహార్‌లోని సీతామర్హిలో రైల్వే ట్రాక్‌ను ధ్వంసం చేసిన వ్యక్తుల పేర్లు కూడా పేర్కొనలేదు.

ఈ వైరల్ వీడియోపై రైల్వే మంత్రిత్వ శాఖ తన అధికారిక ఫేస్‌బుక్‌ ఖాతాలో స్పందిస్తూ, “ఈ వీడియో పాతది. దయచేసి పుకార్లను పట్టించుకోకండి” అని పేర్కొంది.

ఈ వైరల్ వీడియోలో రైల్వే పట్టాలు ధ్వంసం చేస్తున్న వ్యక్తి ముస్లిమా? కదా? అని మేము ఖచ్చితంగా నిర్ధారించలేనప్పటికీ, అందుబాటులో ఉన్న ఆధారాలను బట్టి ఈ ఘటనలో ఎటువంటి మతపరమైన కోణం లేదని స్పష్టమవుతోంది.  ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం కోసం మేము సీతామర్హి రైల్వే పోలీసులను కూడా సంప్రదించాము, వారి నుండి సమాధానం రాగానే ఈ ఆర్టికల్ అప్డేట్ చేయబడుతుంది.

చివరగా, 2022లో బీహార్‌లోని సీతామర్హిలో రైల్వే పరీక్షలో అవకతవకలు జరిగాయిని విద్యార్థులు చేసిన నిరసనకు సంబంధించిన వీడియోను మతపరమైన కోణంతో షేర్ చేస్తున్నారు.