1958లో ఫ్రెంచ్ సైన్యానికి చెందిన ఒక యూనిట్ వారు ఒక గాడిదను కాపాడినప్పుడు తీసిన ఫోటోను తప్పుడు కథనంతో షేర్ చేస్తున్నారు

ఆర్మీ యూనిఫాం ధరించిన ఒక వ్యక్తి, తన వీపుపై ఒక గాడిదను మోసుకెళ్తున్న ఫోటో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని షేర్ చేస్తూ, ల్యాండ్‌మైన్‌లు ఉన్న ప్రదేశంలో వాళ్లు నడుస్తున్నప్పుడు, ఆ గాడిద తప్పటడుగులు వేసి అందరూ చనిపోయేలా చేయడాన్ని నివారించడానికి తను ఇలా చేశాడని షేర్ చేస్తున్నారు. అలాగే, ‘కొన్ని సందర్భాల్లో, మనల్ని మనం రక్షించుకోవడానికే మన చుట్టూ ఉన్న ‘గాడిదల్ని’ సహించాల్సి వస్తుంది. ఇది ఒక గుణపాఠం.,’ అని ఒక సూక్తిని కూడా ఈ ఫొటోతో పాటు షేర్ చేస్తున్నారు. అసలు ఈ ఫోటో వెనుక ఉన్న నిజానిజాలు ఏంటో, ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

ఈ క్లెయిమ్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ మీరు ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ల్యాండ్‌మైన్‌లు ఉన్న ప్రదేశంలో కొందరు సైనికులు వెళ్తున్నప్పుడు వారితో ఉన్న గాడిద తప్పటడుగులు వేసి, వాళ్లందరి చావుకు కారణమవడాన్ని నివారించడానికి, ఒక సైనికుడు ఈ ఫొటోలో కనిపిస్తున్నట్టుగా తన వీపుపై ఆ గాడిదని మోసాడు. 

ఫ్యాక్ట్ (నిజం): ఈ ఫొటోలో కనిపిస్తున్న సైనికులు ఫ్రాన్స్ దేశం యొక్క ‘ది ఫ్రెంచ్ ఫారిన్ లెజియన్’కు చెందిన వారు. వారు 1958లో అల్జీరియాలో ఒక బలహీనమైన గాడిద పిల్లను కాపాడినప్పుడు తీసిన ఫోటో ఇది. వైరల్ పోస్టులో చెప్తున్నట్లుగా ల్యాండ్‌మైన్‌లు ఉన్న ప్రదేశంలో నడుస్తూ, భద్రత కోసం ఆ గాడిదను తమ వీపు పైన వేసుకుని వెళ్లలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది.

ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి, తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతికాము. ఈ సెర్చ్ ద్వారా ఈ ఫోటోని 1958లో తీశారని మాకు ‘fake history hunter’ అనే వెబ్సైటు వారు ప్రచురించిన ఒక ఆర్టికల్ ద్వారా తెలిసింది. 

ఫ్రెంచ్ సైన్యానికి చెందిన, ది ఫ్రెంచ్ ఫారిన్ లెజియన్ యొక్క 13వ డెమి-బ్రిగేడ్ (ఇక్కడ, ఇక్కడ) వారు అల్జీరియాలో డ్యూటీలో ఉన్నప్పుడు, వారికి ఒక ఆకలితో అలమటిస్తున్న గాడిద కనిపించింది. ఆ సైనికులు దానిపై జాలి చూపించి, వారితో కూడా వారి బేస్‌కు దాన్ని తీసుకెళ్లారు. 

బలహీనంగా ఉన్న ఆ గాడిదను తమ వీపుపై మోసుకెళ్తున్నప్పుడు తీసిన ఫోటోనే ఇప్పుడు వైరల్ అవుతున్న ఫోటో. ఈ ఫోటోని ఆరోజుల్లో డైలీ మిర్రర్, డైలీ మెయిల్, పారిస్ మ్యాచ్ వంటి వార్తా పత్రికలు కూడా ప్రచురించాయని ఈ ఆర్టికల్‌లో వారు పేర్కొన్నారు.

దీన్ని ఆధారంగా తీసుకొని, ఆ కథనాల కోసం మేము తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతుకగా, ‘the British news paper archive’ వారి వెబ్సైటులో 19 సెప్టెంబర్ 1958 నాటి డైలీ మిర్రర్ పత్రిక యొక్క ఆర్కైవ్ కాపీ మాకు లభించింది (ఆర్కైవ్ లింక్). 

ఈ ఎడిషన్ యొక్క మొదటి పేజీలోనే వైరల్ అవుతున్న ఫోటో యొక్క క్రాప్ చేసిన వెర్షన్ మాకు లభించింది. ‘The donkey that joined the foreign legion’(ఫారిన్ లెజియన్‌లో జేరినా గాడిద) అనే శీర్షికతో ఈ కథనాన్ని వారు ప్రచురించారు. దీని ప్రకారం, అల్జీరియాలో డ్యూటీ చేస్తున్న ఫ్రెంచ్ ఫారిన్ లెజియన్ సైనికులు, తన తల్లి చేత వదిలేయబడి, బలహీనంగా నడవలేని పరిస్థితుల్లో ఉన్న ఒక పిల్ల గాడిదను తమ కూడా వారు తీసుకెళ్లారు.  ఇందులో ఎక్కడ కూడా వైరల్ పోస్టులో చెప్తున్నట్లు వారు ల్యాండ్‌మైన్‌లు ఉన్న ప్రదేశంలో నడుస్తున్నప్పుడు, భద్రత కోసం ఆ గాడిదను ఇలా మోసుకెళ్లారని చెప్పలేదు. 

అలాగే, ఈ ఫోటో గురించి వెతుకుతున్న సమయంలో, foreignlegion.info  అనే వెబ్సైటులో ది ఫ్రెంచ్ ఫారిన్ లెజియన్ యొక్క 13వ డెమి-బ్రిగేడ్ వారి గురించి ప్రచురించిన ఒక ఆర్టికల్ మాకు దొరికింది. ఇందులో కూడా ఈ గాడిద గురించి ప్రస్తావన ఉంది. ఈ ఆర్టికల్ ప్రకారం వారు ఆ గాడిదను కాపాడి దానికి బాంబీ అనే పేరు పెట్టారు, ఇందుకు గాను వీరికి ‘Royal Society for the Prevention of Cruelty to Animals’ (RSPCA) అనే లండన్ సంస్థ ఒక మెడల్ ఇచ్చింది. 

డగ్లస్ పోర్చ్ అనే అనే రచయిత 1991లో రాసిన ‘The French Foreign Legion: a complete history’ అనే పుస్తకంలో (ఆర్కైవ్ లింక్) ఈ గాడిద గురించి ప్రస్తావన ఉంది. 1958లో, ది ఫ్రెంచ్ ఫారిన్ లెజియన్ యొక్క 13వ డెమి-బ్రిగేడ్ వారు ఆకలితో అలమటిస్తున్న ఒక గాడిదను కాపాడి, దానికి బాంబీ అనే పేరు పెట్టారని ఇందులో పేర్కొన్నారు. 

ఇలా చేసినందుకు RSPCA నుంచే కాకుండా, American Society for the Prevention of Cruelty to Animals నుంచి వీరికి ఒక మెరిట్ సర్టిఫికెట్ వచ్చిందని ఈ పుస్తకంలో డగ్లస్ పోర్చ్ పేర్కొన్నారు. ఈ గాడిదకు బాంబీ అనే పేరు పెట్టారని, బాంబిని వారి మస్కట్‌గా చేసుకున్నారని, డైలీ మిర్రర్ పత్రిక యొక్క 16 ఫిబ్రవరి 1959 ఎడిషన్‌లో పేర్కొన్నారు . దీనిబట్టి, వైరల్ పోస్టులో ఈ సంఘటనకు చెందిన ఫోటోను ఒక తప్పుడు కథనంతో షేర్ చేస్తున్నారని మనకు స్పష్టం అవుతుంది.

చివరగా, 1958లో ది ఫ్రెంచ్ ఫారిన్ లెజియన్ వారు ఒక గాడిదను కాపాడినప్పుడు తీసిన ఫోటోను ఒక తప్పుడు కథనంతో షేర్ చేస్తున్నారు.