2021 ఉత్తరాఖండ్ వరదల ఫోటోని బెంగళూరులో ఇటీవల కురిసిన వర్షాలకు కార్లు వరదలలో మునిగిపోయిన చిత్రమంటూ షేర్ చేస్తున్నారు

బెంగళూరులో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కార్లు వరదలో మునిగిపోయిన చిత్రమంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ అవుతోంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం. 

క్లెయిమ్: బెంగళూరులో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కార్లు వరదలో మునిగిపోయిన చిత్రం.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఫోటో పాతది. 2021లో ఉత్తరాఖండ్‌లో కురిసిన భారీ వర్షాలకు జిమ్ కార్బెట్ నేషనల్ పార్కు సమీపంలోని ఒక హోటల్ దగ్గర కార్లు వరద నీటిలో మునిగిపోయిన దృశ్యాన్ని ఈ ఫోటో చూపిస్తుంది. ఈ ఫోటో బెంగళూరు వర్షాలకు సంబంధించినది కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే ఫోటోని షేర్ చేస్తూ ‘Alarabiya News’ వార్తా సంస్థ 21 అక్టోబర్ 2021 నాడు ఆర్టికల్ పబ్లిష్ చేసినట్టు తెలిసింది. 19 అక్టోబర్ 2021 నాడు ఉత్తరాఖండ్‌లో కురిసిన భారీ వర్షాలకు జిమ్ కార్బెట్ నేషనల్ పార్కు సమీపంలోని ఒక హోటల్ దగ్గర కార్లు వరద నీటిలో మునిగిపోయిన దృశ్యమని ఈ ఫోటో వివరణలో తెలిపారు. 2021 అక్టోబర్ నెలలో ఉత్తరాఖండ్‌లో కురిసిన భారీ వర్షాలకు కోసి నది పొంగిపొర్లుతూ తీవ్ర ప్రాణ నష్టం మరియు ఆస్తి నష్టం కలిగించింది. ఈ వరదలలో 20 మంది చనిపోవడమే కాక, మరెంతో మంది గల్లంతయినట్టు ఈ ఆర్టికల్‌లో రిపోర్ట్ చేసారు.

ఈ ఫోటోని ఇదే వివరణతో మరికొన్ని వార్తా సంస్థలు కూడా ఆర్టికల్స్ పబ్లిష్ చేసాయి. ఆ ఆర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన ఫోటో పాతది అని, ఇటీవల బెంగళూరులో కురిసిన వర్షాలకు సంబంధించినది కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, 2021 ఉత్తరాఖండ్ వరదలకు సంబంధించిన ఫోటోని బెంగళూరులో ఇటీవల కురిసిన వర్షాలకు కార్లు వరదలలో మునిగిపోయిన చిత్రమంటూ షేర్ చేస్తున్నారు.