2019లో తమిళనాడులో ఘర్షణల వల్ల ధ్వంసమయిన అంబేద్కర్ విగ్రహాన్ని కేరళలో ఇస్లామిక్ తీవ్రవాదులు చేసినట్టుగా షేర్ చేస్తున్నారు

కేరళలో అంబేద్కర్ విగ్రహం తలను తీసేసిన ఇస్లామిక్ తీవ్రవాదులు అని అంటూ ఒక వీడియోతో ఉన్న పోస్టును బాగా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: కేరళలో ఇస్లామిక్ తీవ్రవాదులు అంబేద్కర్ విగ్రహం తల తీసేసిన వీడియో.

ఫాక్ట్: అంబేద్కర్ విగ్రహం తల తీసేస్తున్నట్టు కనబడుతున్న ఈ వీడియో 2019లో తమిళనాడులో తీసింది, కేరళలో కాదు. తమిళనాడులోని నాగపట్టణం జిల్లాలోని వేదరణ్యం పట్టణంలో రెండు కులాల మధ్య ఘర్షణలు చెలరేగాయి, ఆ గొడవల్లో ఈ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు; ఇది ఇస్లామిక్ తీవ్రవాదుల పనిగా ఏ న్యూస్ రిపోర్ట్స్ తెలుపలేదు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.

వీడియోను స్క్రీన్‌షాట్స్ తీసి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అదే విజువల్స్‌తో ఉన్న ఒక యూట్యూబ్‌ వీడియో లభించింది. కనక్ న్యూస్ ఈ వీడియోను 26 ఆగష్టు 2019న యూట్యూబ్‌లో అప్లోడ్ చేసింది. “తమిళనాడులో జరిగిన గ్రూప్ క్లాష్ వలన అంబేద్కర్ విగ్రహం ధ్వంసం, కారు దహనం” అంటూ వీడియో యొక్క టైటిల్ చూడొచ్చు. కావున, ఈ వీడియో కేరళలో తీసింది కాదు, తమిళనాడులో తీసింది.

ఈ వీడియో తమిళనాడుకు సంబంధించింది అని తెలిసి, గూగుల్లో వెతకగా, కొన్ని న్యూస్ ఆర్టికల్స్ లభించాయి. 25 ఆగష్టు 2019న తమిళనాడులోని నాగపట్టణం జిల్లాలోని వేదరణ్యం పట్టణంలో రెండు కుల సమూహాల మధ్య ఘర్షణలు చెలరేగాయి, ఆ గొడవల్లో అంబేద్కర్ విగ్రహాన్ని (వీడియోలో ఉన్నట్టుగా) ధ్వంసం చేశారు. ఈ సంఘటన తరువాత వేదరణ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు, అదనపు దళాలను మోహరించారు, ఘర్షణల సమయంలో ధ్వంసమైన అంబేద్కర్ విగ్రహాన్ని 12 గంటల వ్యవధిలో సరికొత్తదానితో మార్చారు.

చివరగా, తమిళనాడులో కుల సమూహాల మధ్య ఘర్షణల వల్ల ధ్వంసమయిన అంబేద్కర్ విగ్రహాన్ని కేరళలో ఇస్లామిక్ తీవ్రవాదులు చేసినట్టుగా షేర్ చేస్తున్నారు.