2019 కుంభమేళలో యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నప్పటి ఫోటోని అయోధ్య లో ఇప్పుడు తీసినట్టుగా చెప్తున్నారు

అయోధ్యలో ఆనందోత్సాహాల నడుమ ఉన్న ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించి ఒక ఫోటోని కూడా పోస్టులో షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: అయోధ్యలో ఆనందోత్సాహాల నడుమ హనుమ స్వరూపంలో ఉన్న ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.

ఫాక్ట్ (నిజం): 2019లో జరిగిన కుంభమేళలో యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నప్పటి ఫోటోని అయోధ్యలో ఆనందోత్సాహాల నడుమ ఉన్న యోగి అని తప్పుగా షేర్ చేస్తున్నారు. ఈ వార్తకి సంబంధించి చాలా వార్తా కథనాలు 2019 లో ప్రచురింపబడ్డాయి. యోగి ఆదిత్యనాథ్ కుంభమేళలో పాల్గొన్నప్పటి మరికొన్ని ఫోటోలు తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఎకౌంటు లో షేర్ చేసారు. కావున, పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.

ఈ ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఈ ఫోటోని ప్రచురించిన ఒక వార్తా కథనం మాకు కనిపించింది. ఈ కథనం ప్రచురించిన తేదీ 30 జనవరి 2019గా ఉంది. దీన్నిబట్టి ఈ ఫోటో పాతదని చెప్పొచ్చు. పైగా ఈ వార్తా కథనం ప్రకారం ఈ ఫోటో 2019లో ప్రయాగ్ రాజ్ లో జరిగిన కుంభమేళలో యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నప్పుడు తీసింది.

యోగి ఆదిత్యనాథ్ కుంభమేళలో పాల్గొన్నప్పటి మరికొన్ని ఫోటోలు తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఎకౌంటు లో షేర్ చేసారు. వాటిని ఇక్కడ చూడొచ్చు.

అయోధ్యలో 05 ఆగస్టు 2020న జరిగిన రామ మందిరం భూమి పూజ నేపధ్యంలో ఈ ఫోటో వైరల్ అవుతోంది.. ఐతే రామ మందిరానికి సంబంధించిన సుప్రీం కోర్ట్ తీర్పు 09 నవంబర్ 2019న వెలువడింది, సుప్రీం కోర్ట్ తీర్పు పూర్తి కాపీని ఇక్కడ చదవొచ్చు. కాని పోస్టులో షేర్ చేస్తున్న ఫోటో 30 జనవరి 2019న తీసింది. దీన్నిబట్టి ఈ ఫోటోకి అయోధ్యకి ఎటువంటి సంబంధంలేదని కచ్చితంగా చెప్పొచ్చు.

చివరగా, 2019 కుంభమేళలో యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నప్పటి ఫోటోని. అయోధ్యలో ఆనందోత్సాహాల నడుమ ఉన్న యోగి అని తప్పుగా షేర్ చేస్తున్నారు.