2018 ఎన్నికలకు సంబంధించిన వీడియోని నాగార్జున సాగర్ ఉప ఎన్నికల నేపథ్యంలో మళ్ళీ షేర్ చేస్తున్నారు

వచ్చే నెలలో నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక జరుగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేత జానా రెడ్డి ఎన్నికల ప్రచారంలో ప్రజలపై అరుస్తున్నట్టు ఉన్న వీడియో షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఐతే ఇదే నేపథ్యంలో ఒక మీటింగ్ లో పాల్గొన్న వారిపై జానా రెడ్డి అరుస్తున్న మరొక వీడియో (ఆర్కైవ్డ్) కూడా సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ వీడియోలకి సంబంధించి నిజమేంటో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేత జానా రెడ్డి ప్రజలపై అరుస్తున్న వీడియో.

ఫాక్ట్ (నిజం): ఈ వీడియో 2018 ఎన్నికల సందర్భంగా నల్గొండ జిల్లాలోని నాగార్జున పేటలో జరిగిన ప్రచారంలో అక్కడి ప్రజలు కాంగ్రెస్ నేత జానా రెడ్డిని అభివృద్ధి పనులకు సంబంధించి నిలదీయడంతో జానా రెడ్డి అసహనం వ్యక్తం చేసిన సంఘటనకి సంబంధించింది. మరొక వీడియో 2018లో జరిగిన ఎన్నికలకు సంబంధించి మిర్యాలగూడలో జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీటింగ్ లో జరిగిన సంఘటనకి సంబంధించింది. ఈ వీడియోలకి వచ్చే నెలలో నాగార్జున సాగర్ లో జరగనున్న ఉప ఎన్నికలకు ఎటువంటి సంబంధంలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

వీడియో 1:

పోస్టులోని వీడియోకి సంబంధించి మరింత సమాచారం కోసం యూట్యూబ్ లో కీవర్డ్స్ తో వెతకగా ఇదే వీడియోని 2018లో రిపోర్ట్ చేసిన ఒక వార్తా కథనం మాకు లభించింది. ఈ కథనం ప్రకారం ఈ వీడియో2018లో జరిగిన జనరల్ ఎలక్షన్స్ కి సంబంధించి నల్గొండ జిల్లాలోని నాగార్జున పేటలో ఎన్నికల ప్రచారానికి వెళ్ళిన కాంగ్రెస్ నేత జానా రెడ్డిని అక్కడి ప్రజలు అభివృద్ధి పనులకు సంబంధించి నిలదీయడంతో జానా రెడ్డి అసహనం వ్యక్తం చేసిన సంఘటనకి సంబంధించింది.

ఇదే వీడియోని ప్రచురించిన మరొక వార్తా కథనం ఇక్కడ చూడొచ్చు. ఈ కథనం కూడా పైన తెలిపిన విషయాన్నే చెప్పింది. వీటన్నిటిబట్టి ఈ వీడియో 2018 ఎన్నికల సంబంధించిందని, వచ్చే నెలలో నాగార్జున సాగర్ లో జరగబోయే బై ఎలక్షన్స్ ప్రచారానికి సంబంధించింది కాదని స్పష్టమవుతుంది.

వీడియో 2:

ఈ వీడియోకి సంబంధించి మరింత సమాచారం కోసం యూట్యూబ్ లో కీవర్డ్స్ తో వెతకగా ఇదే వీడియోని 2018లో రిపోర్ట్ చేసిన ఒక వార్తా కథనం మాకు లభించింది. ఈ కథనం ప్రకారం 2018లో తెలంగాణలో జరిగిన ఎన్నికలకి సంబంధించి మిర్యాలగూడలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల మీటింగ్ లో ఈ సంఘటన చోటుచేసుకుంది.

ఈ వీడియోని 2018లో రిపోర్ట్ చేసిన మరొక వార్త కథనం ఇక్కడ చూడొచ్చు. వీటిని బట్టి ఈ వీడియోకి వచ్చే నెలలో జరగబోయే ఉప ఎన్నికలకి ఎటువంటి సంబంధంలేదని స్పష్టంగా అర్ధమవుతుంది.

చివరగా, 2018 ఎన్నికలకు సంబంధించిన వీడియోలని నాగార్జున సాగర్ ఉప ఎన్నికల నేపథ్యంలో మళ్ళీ షేర్ చేస్తున్నారు.