ప్రస్తుత రాజకీయాలని చూస్తుంటే, రాజకియల నుంచి వెళ్ళిపోవాలని ఉందని తెలంగాణా ఆర్ధిక మంత్రీ హరీష్ రావు దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలో బై-ఎలక్షన్స్ ప్రచారము సందర్బంగా చెప్పారు, అంటూ షేర్ చేస్తున్న ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం ప్రచారంలో తనకి రాజకీయాల నుండి వెళ్ళిపోవాలని ఉందని హరీష్ రావు ప్రకటించారు.
ఫాక్ట్ (నిజం): 2018లో సిద్ధిపేట జిల్లాలోని ఇబ్రహింపూర్ గ్రామంలో జరిగిన సభలో సిద్ధిపేట జిల్లా ప్రజలు తన పై చూపిస్తున్న ప్రేమ వల్ల భావోద్వేగానికి లోనై తను ఇక రాజకీయాలనుండి వైదోలుగుతే బాగుంటుందని అన్నారు, దాని మీద తరువాత స్పష్టత కూడా ఇచ్చారు. ఈ వ్యాఖ్యలకి దుబ్బాకలో జరగబోతున్న బై-ఎలక్షన్స్ కి ఎటువంటి సంబంధం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
తెరాస ముఖ్య నేత, ఆర్థిక మంత్రి హరీష్ రావు, తన రాజకీయ సన్యాసం గురించి ఏదైనా సభలో మాట్లాడారా అని వెతకగా, 2018లో సిద్ధిపేట జిల్లాలోని ఇబ్రహింపూర్ గ్రామంలో జరిగిన సభలో తను ఇక రాజకీయాలనుండి వైదోలుగుతే బాగుంటుందని హరీష్ రావు మాట్లాడినట్టు తెలిసింది. ఆ సభలో హరీష్ రావు మాట్లాడిన మాటలు ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
సిద్ధిపేట జిల్లా వాసులు తనపై చూపిస్తున్న ప్రేమ, ఆదరణ ఎప్పటికి మరిచిపోలేను అని హరీష్ రావు ఆ సభలో అన్నారు. ఈ తృప్తి, గౌరవంతోనే ఇక రాజకీయాలనుండి వెళ్ళిపోతే బాగుంటుందా అనే ఆలోచన తనకు వస్తుందని హరీష్ రావు ఆ సభలో అన్నారు. ఇబ్రహింపూర్ సభలో మాట్లాడిన మాటలు, సిద్ధిపేట జిల్లా ప్రజలు తన పై చూపిస్తున్న ప్రేమ వల్ల భావోద్వేగానికి లోనై మాట్లాడిన మాటలే అని హరీష్ రావు తరువాత స్పష్టతనిచ్చారు. తెరాస పార్టీ లో తనకు విలువ ఇవ్వట్లేదని వ్యతిరేక పార్టిలు తప్పుగా ప్రచారం చేస్తున్నాయి, అని హరీష్ రావు తెలిపారు.
అధికార తెరాస పార్టీ దుబ్బాక MLA సోలిపేట రామలింగ్ రెడ్డి మరణించడంతో ఇప్పుడు అక్కడ బై ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఆ నేపధ్యంలోనే హరీష్ రావు ఇలా నాటకాలు చేస్తున్నారని ఈ ఫోటోని షేర్ చేస్తున్నారు.
చివరగా, 2018లో సిద్ధిపేట జిల్లా ఇబ్రహింపూర్ గ్రామ సభలో హరీష్ రావు భావోద్వేగానికి లోనై మాట్లాడిన మాటలని ప్రస్తుత దుబ్బాక బై ఎలక్షన్స్ ప్రచారంలో మాట్లాడినట్టుగా షేర్ చేస్తున్నారు.