ఒక ఆసుపత్రిలో ఏడుగురు మహిళలు వరుసగా కూర్చొని సెలైన్లు ఎక్కించుకుంటున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్టం విజయనగరం జిల్లాలో కొత్తవలస ప్రభుత్వ ఆసుపత్రిలో తీసిన చిత్రం అని, AP ఆరోగ్యశాఖ మంత్రిని పేర్కొంటూ, ప్రభుత్వానికి గిరిపుత్రుల ప్రాణాలకంటే వారి ఓట్లు ముఖ్యం అని పోస్టు యొక్క వివరణలో తెలిపారు. ఈ క్లెయిమ్ ఎంత వరకు నిజమో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.
క్లెయిమ్: వైకాపా ప్రభుత్వం హయాంలో ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్టం విజయనగరం జిల్లాలో కొత్తవలస ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన సదుపాయాల లేకుండా గిరిజన మహిళలు చికిత్స పొందుతున్న దృశ్యం.
ఫాక్ట్ (నిజం): ఈ ఫోటో 2018లో కొత్తవలస ఆశ్రమ పాఠశాలకు చెందిన 14 మంది విద్యార్థులు డ్రగ్ ఎలర్జీ, తీవ్ర జ్వరం లక్షణాలతో విజయనగరం జిల్లా సాలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న దృశ్యం. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగింది, వైకాపా ప్రభుత్వ హయాంలో కాదు. కావున ఈ క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
ఈ ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చెయ్యగా, పలు ట్విట్టర్ పోస్టులు (ఇక్కడ మరియు ఇక్కడ) మరియు సాక్షి న్యూస్ వీడియో ద్వారా ఇది 2018లో కొత్తవలస ఆశ్రమ పాఠశాలకు చెందిన 14 మంది విద్యార్థులు విజయనగరం జిల్లా సాలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు అని తెలిసింది. ఈ ఘటన గురించి అప్పటి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడుని ప్రతిపక్ష నాయకులు విమర్శించారు.
దీని గురించి మరింత తెలుసుకోవటానికి, కీ వర్డ్స ఉపయోగించి ఇంటర్నెట్లో వెతకగా, పలు వార్త పత్రికలు దీని గురించి ప్రచురించాయి అని తెలిసింది (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ). జ్వరంతో బాధపడుతున్న విద్యార్థులకు మలేరియాను నివారించడానికి క్లోరోక్విన్‌ను అందించారు, అయితే వారిలో కొంతమందికి అలెర్జీ అయిందని అప్పట్లో రిపోర్ట్ చేసారు. వారి పరిస్థితి నిలకడగా అయిందని ఆసుపత్రి బృందం తెలిపిందని ఈ పత్రికా రిపోర్ట్స్ ద్వారా తెలిసింది.
అయితే వైకాపా ప్రభుత్వ హయాంలో కూడా గిరిజనులకు సరైన వైద్య సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నట్టు మీడియా రిపోర్ట్ చేసిన ఘటన ఒకటి ఇక్కడ చూడవచ్చు.
చివరిగా, 2018లో విజయనగరం జిల్లాలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గిరిజన విద్యార్థుల ఫోటోను ఇటీవలి సంఘటనగా షేర్ చేస్తున్నారు.