2016లో పంజాబ్ లో జరిగిన ఒక ర్యాలీ వీడియోని ఢిల్లీలో రైతులు చేస్తున్న నిరసనలకి ముడి పెడుతున్నారు

“పాకిస్తాన్ జిందాబాద్ అని నినాదాలు చేస్తూ, రైతు ఉద్యమం అంటున్నారు.”, అని క్లెయిమ్ చేస్తూ షేర్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు దేశవ్యాప్తంగా నిరసన చేస్తున్న నేపధ్యంలో ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో చేస్తున్న ధర్నాలో రైతులు ‘పాకిస్తాన్ జిందాబాద్’ నినాదాలు చేస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఈ వీడియో పంజాబ్ లో జరిగిన ఒక పాత ర్యాలీకి సంబంధించినది. 2016లో పంజాబ్ లోని సిక్కు మతానికి చెందిన కొన్ని గ్రూపులు, శివ సేన పార్టీ అమృత్సర్ లో నిర్వహించాలనుకున్న ర్యాలీని వ్యతిరేకిస్తూ ఇలా కత్తులు పట్టుకొని ర్యాలీ నిర్వహించారు. ఈ వీడియోకి ఇటివల రైతులు వ్యవసాయ బిల్లులకి సంబంధించి చేస్తున్న నిరసనలకి ఎటువంటి సంబంధం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, అవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘Khalsa Gatka Group’ తమ యూట్యూబ్ ఛానెల్లో ‘25 మే 2016’ నాడు పోస్ట్ చేసినట్టు తెలిసింది. ఈ వీడియోలోని 0.42 నుండి 1.11 నిమిషాల మధ్య పోస్టులో కనిపిస్తున్న అవే దృశ్యాలని మనం చూడవచ్చు. అమృత్సర్ లోని బియాస్ నది బ్రిడ్జి పై తీసిన లైవ్ వీడియో అని వీడియో వివరణలో తెలిపారు. ఈ ర్యాలీకి సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుపుతూ ‘Khalsa Force’, తమ వెబ్సైటులో ఆర్టికల్ పబ్లిష్ చేసింది. శివ సేన పార్టీ అమృత్సర్ లో నిర్వహించాలనుకున్న ‘Lalkar’ ర్యాలీని సవాలు చేస్తూ కొన్ని వేల మంది సిక్కులు ‘25 మే 2016’ నాడు అమృత్సర్ లోని బియాస్ నది బ్రిడ్జి పై భారి ర్యాలీ నిర్వహించినట్టు అందులో తెలిపారు.

సిక్కులు కత్తులు చేత పట్టి నిర్వహించిన ఈ ర్యాలీకి ‘Anakh rally’ అనే పేరు పెట్టారు. పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క తరువాయి దృశ్యాలని చూపుతున్న వీడియోని, ఒక యూసర్ తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేసినట్టు తెలిసింది. ఈ వీడియోలోని దృశ్యాలు, ‘Khalsa Gatka Group’ పోస్ట్ చేసిన వీడియోలోని దృశ్యాలతో మ్యాచ్ అవుతున్నాయి.

ఈ ర్యాలీకి సంబంధించి ‘Hindustan Times’ మరియు ‘The Indian Express’ న్యూస్ వెబ్ సైట్స్ ఆర్టికల్స్ పబ్లిష్ చేసాయి. అవి ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. Akhila Bharatiya Hindu Suraksha Samiti(ABHSS) వారు నిర్వహించాలనుకున్న ‘Lalkar’ ర్యాలిని వారు ఆపివేసినప్పటికి, సిక్కు మతానికి చెందిన గ్రూపులు ‘Anakh rally’ పేరుతో భారి ర్యాలీ నిర్వహించినట్టు ఈ ఆర్టికల్స్ లో తెలిపారు. ఈ ఘటనకి సంబంధించి పంజాబ్ లోకల్ న్యూస్ ఛానల్ ‘Global Punjab Tv’ రిపోర్ట్ చేసిన వీడియోని ఇక్కడ చూడవచ్చు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన ఈ వీడియో ఇటివల రైతులు వ్యవసాయ బిల్లులకి సంబంధించి చేస్తున్న నిరసనలకు సంబంధించినవి కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, 2016లో పంజాబ్ లో జరిగిన ఒక ర్యాలీ వీడియోని చూపిస్తూ ఇటివల రైతులు ఢిల్లీలో చేస్తున్న నిరసనలకి సంబంధించిన దృశ్యాలని షేర్ చేస్తున్నారు.