పాత ఫోటో పెట్టి, రాళ్లు విసిరినందుకు ఫొటోలోని వ్యక్తికి లక్షన్నర రూపాయల ఫైన్ వేసినట్టు తప్పుగా ప్రచారం చేస్తున్నారు

పౌరసత్వ సవరణ చట్టం కి వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా ఉత్తర్ ప్రదేశ్ లో నిరసనలు జరుగుతున్నాయి. అందులో కొన్ని హింసాత్మకంగా కూడా మారాయి. ఫేస్బుక్ లో ఒక ఫోటోని పోస్టు చేసి, ‘రెహమాన్ అనే వ్యక్తి రాళ్లు విసిరినందుకు గానూ ఉత్తర్ ప్రదేశ్ లోని యోగి ఆదిత్యనాధ్ ప్రభుత్వం అతనికి లక్షన్నర రూపాయల ఫైన్ వేస్తూ నోటీసు ఇచ్చింది’ అని పేర్కొంటున్నారు. పోస్టులో చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజముందో పరిశీలిద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: పౌరసత్వ సవరణ చట్టం కి వ్యతిరేకంగా ఉత్తర్ ప్రదేశ్ లో జరుగుతున్న నిరసనల్లో రాళ్లు రువ్వుతున్న వ్యక్తి ఫోటో.

ఫాక్ట్ (నిజం): పోస్ట్ లోని ఫోటో 2016 నుండి ఇంటర్నెట్ లో ఉన్నట్టు చూడవొచ్చు. కొందరు అది పశ్చిమ బెంగాల్ లోని ‘మాల్దా’ అల్లర్లకు సంబంధించిన ఫోటో అని పోస్ట్ చేసారు. ఆ ఫోటోకీ, తాజాగా ఉత్తరప్రదేశ్ లో జరిగిన నిరసనలకూ ఎటువంటి సంబంధం లేదు. కావున, పోస్టులో చెప్పింది తప్పు.

పౌరసత్వ సవరణ చట్టం కి వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా ఉత్తర్ ప్రదేశ్ లో నిరసనలు జరుగుతున్నాయి. నిరసనల్లో నిరసనకారులు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తే, వారి ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని యూపీ సీఎం ఆదిత్యానాధ్ తెలిపినట్లుగా ‘India Today’ వారి కథనం లో చూడవచ్చు.

పోస్టులోని ఫోటో ని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అది ఒక ట్విట్టర్ వినియోగదారుడి ట్వీట్ లో లభించింది. ఆ వినియోగదారుడు ఆ ట్వీట్ ని జనవరి 6, 2016న పెట్టాడు మరియు ఫోటో ‘మాల్డా అల్లర్లకు’ సంబంధించినదని అందులో రాశాడు. 2016 జనవరి లో అఖిల భారత హిందూ మహాసభ నాయకుడు కమలేష్ తివారీ ప్రసంగానికి వ్యతిరేకముగా పశ్చిమ బెంగాల్ లోని ‘మాల్దా’ లో అల్లర్లు చెలరేగాయని ‘India Today’ వారి జనవరి 6, 2016 కథనం ద్వారా తెలుస్తుంది. కావున, పోస్టులోని ఫోటో పాతది. దానికీ, ప్రస్తుతం ఉత్తర్ ప్రదేశ్ లో పౌరసత్వ సవరణ చట్టం కి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలకీ ఎటువంటి సంబంధం లేదు.    

చివరగా, పాత ఫోటో పెట్టి, రాళ్లు విసిరినందుకు ఫొటోలోని వ్యక్తికి లక్షన్నర రూపాయల ఫైన్ వేసినట్టు తప్పుగా ప్రచారం చేస్తున్నారు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?