2016 ఫోటోని, ‘కరోనా చికిత్స పొందుతున్న విజయసాయి రెడ్డిని పరామర్శించిన జగన్’ అని ప్రచారం చేస్తున్నారు

కరోనా సోకి హాస్పిటల్ లో చేరిన విజయసాయి రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పరమర్శించినట్టుగా చేప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఆ పోస్ట్ నిజమెంతుందో ఈ కధనం ద్వారా చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కరోనాతో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విజయసాయి రెడ్డిని పరామర్శించిన జగన్.

ఫాక్ట్ (నిజం): 2016లో రోడ్డు ప్రమాదంలో విజయసాయి రెడ్డి గాయపడినప్పుడు జగన్ తనని పరమర్శించినప్పటి ఫోటోని, కరోనా సోకిన విజయసాయి రెడ్డిని పరామర్శించినట్టుగా చెప్తున్నారు. ఆ ఫోటోని జాగ్రత్తగా పరిశీలిస్తే అందులో వున్నవారు ఎవరూ మాస్కు ధరించలేదు, సామాజిక దూరం పాటించలేదు. కావున ఆ పోస్టు ద్వారా చెప్తున్నది తప్పు.

ఆ ఫోటోలో ఉన్న సమాచారం గురించి మేము యూట్యూబ్ లో వెతకగా ‘ysrcpoffical’ అనే యూట్యూబ్ ఛానల్ లో మాకు ఆ ఫొటోకు సంబంధించి వీడియో దొరికింది. ఆ వీడియోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విజయసాయి రెడ్డిని జగన్ పరామర్శిస్తున్నట్టుగా ఉంది, కాని ఆ వీడియో అప్లోడ్ చేసిన తేదీ మాత్రం ’11 మే 2016’గా ఉంది. దీన్నిబట్టి ఆ ఫోటో పాతదని చెప్పొచ్చు. అప్పటికింకా కరోనా మొదలవలేదు. ఆ ఫోటోని జాగ్రత్తగా పరిశీలిస్తే అందులో వున్నవారు ఎవరూ కూడా మాస్కు ధరించలేదు మరియు సామాజిక దూరం పాటించలేదు.

ఆ వీడియో అప్లోడ్ చేసిన తేదీ ద్వారా ఫోటో గురించి మరింత సమాచారం వెతకగా ’10 మే 2016’న జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో విజయసాయి రెడ్డి గాయపడినట్టుగా తెలిసింది, చికిత్స కోసం హాస్పిటల్ లో అడ్మిట్ అయినప్పుడు జగన్ తనని పరామర్శించాడు. దీనికి సంబంధించిన వివరాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

విజయసాయి రెడ్డి తన ట్విట్టర్ ఎకౌంటులో ‘కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపధ్యంలో తను ఒక వారం, పది రోజులు quarantine అవుతునట్టుగా’ చెప్పాడు.

చివరగా, 2016లో రోడ్డు ప్రమాదంలో విజయసాయి రెడ్డి గాయపడినప్పుడు జగన్ తనని పరామర్శించినప్పటి ఫోటోని, కరోనాతో బాధపడుతున్న విజయసాయి రెడ్డిని జగన్ పరామర్శిస్తున్నట్టుగా చెప్తున్నారు.