గత వారం కాశ్మీర్‌లో సైనికులు ప్రయాణిస్తున్న వాహనంపై దాడి చేసిన ముగ్గురు పాకిస్తాన్ ఉగ్రవాదులను భారత సైన్యం హతమార్చిందంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ అవుతోంది. ఈ దాడిలో భాగంగా 22 మంది స్లీపర్ సెల్స్‌లను భారత సైన్యం పట్టుకొని విచారిస్తుందని, భారీ సంఖ్యలో ఆయుధాలు, పాకిస్థాన్‌కు సంబంధించిన ఆనవాళ్ళు సైన్యానికి లభించినట్టు పోస్టులో తెలుపుతున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: పూంచ్ దాడిలో అయిదుగురు సైనికుల మరణానికి కారకులైన ముగ్గురు పాకిస్తాన్ ఉగ్రవాదులను భారత సైన్యం హతమార్చింది, దానికి సంబంధించిన ఉగ్రవాదుల శవాల ఫోటో.
ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఫోటో, 2015లో జమ్మూకశ్మీర్‌లోని కూప్వార జిల్లాలో భారత సైన్యం జరిపిన దాడిలో మరణించించిన ముగ్గురు పాకిస్తాన్ ఉగ్రవాదుల శవాలను చూపిస్తుంది. పూంచ్ దాడిలో అయిదుగురు సైనికుల మరణానికి కారకులైన ఉగ్రవాదుల కోసం భారత సైన్యం ఇంకా గాలిస్తోంది. పోస్టులో షేర్ చేసిన ఫోటోకి ఇటీవల జరిగిన పూంచ్ దాడితో ఎటువంటి సంబంధం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, ఇదే ఫోటోని షేర్ చేస్తూ ‘ఇండియా టివి’ వార్తా సంస్థ 01 జూన్ 2015 నాడు పబ్లిష్ చేసిన ఆర్టికల్ దొరికింది. 2015లో జమ్మూకశ్మీర్‌లోని కూప్వార జిల్లాలో భారత సైన్యం జరిపిన దాడిలో ముగ్గురు పాకిస్తాన్ ఉగ్రవాదులు హతమయినట్టు ఈ ఆర్టికల్‌లో రిపోర్ట్ చేశారు.
ఈ ఘటనకు సంబంధించి ‘ఇండియా టివి’ పబ్లిష్ చేసిన వీడియోని ఇక్కడ చూడవచ్చు. గతంలో పలు వెబ్సైట్లు పబ్లిష్ చేసిన ఆర్టికల్స్‌లలో ఈ ఫోటోని రిఫరెన్స్ ఫోటోగా వాడుకున్నారు. పై వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన ఫోటో పాతది అని, ఇటీవల జరిగిన పూంచ్ దాడి ఘటనకు సంబంధించినది కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.
20 ఏప్రిల్ 2023 నాడు జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఉగ్రవాదుల జరిపిన గ్రనేడ్ల దాడిలో అయిదుగురు సైనికులు అమరులయ్యారు. పూంచ్ దాడిలో అయిదుగురు సైనికుల మరణానికి కారకులైన ఉగ్రవాదులను పట్టుకొనేందుకు భారత సైన్యం గాలింపు తీవ్రతరం చేసిందని ఇటీవల పలు వార్తా సంస్థలు రిపోర్ట్ చేశాయి. దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం భారత సైన్యం ఇప్పటికే నలభై మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తోందని తెలిసింది. కానీ, పూంచ్ దాడికి పాల్పడిన ఉగ్రవాదులను భారత సైన్యం హతమార్చినట్టు ఇప్పటి వరకూ రిపోర్ట్స్ లేవు. ఈ ఘటన తరువాత భారత సైన్యం కాశ్మీర్‌లో ఉగ్రవాదులను ఎనకౌంటర్ చేసినట్టు కూడా ఎక్కడా రిపోర్ట్ అవలేదు.
చివరగా, సంబంధం లేని పాత ఫోటోని పూంచ్ దాడిలో అయిదుగురు సైనికుల మరణానికి కారకులైన ఉగ్రవాదులను భారత సైన్యం హతమార్చిందంటూ షేర్ చేస్తున్నారు.