2015లో నార్వేలో ముస్లింలు చేపట్టిన మానవ హారం ఫోటోని ఇటీవల జరిగిన స్వీడన్ అల్లర్లదని చెప్తున్నారు

స్వీడన్ లో మొత్తం తగలబెట్టి ఇప్పుడు చర్చిలను కాపడుతున్నట్టుగా ముస్లింలు నాటకాలు ఆడుతున్నారని షేర్ చేస్తున్న ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒక చర్చి ముందు ముస్లిం యువతులు మానవహారం రూపంలో నిలబడి ఉన్న ఫోటో ఈ పోస్టులో  మనం చూడవచ్చు. ఇటివలే బెంగుళూరులో జరిగిన అల్లర్లలో కూడా ముస్లింలు మానవహారంగా దేవాలయం ముందు నిలబడి ఉన్న ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.    

క్లెయిమ్: స్వీడన్ దేశానికి చెందిన ముస్లింలు ఒక చర్చి ముందు మానవహార రూపంలో నిలబడి ఉన్న ఫోటో.

ఫాక్ట్ (నిజం): పోస్టులో కనిపిస్తున్న దృశ్యం 2015లో నార్వే దేశంలో జరిగిన ఒక ఘటనకి  సంబంధించినది. డెన్మార్క్ దేశంలో యూదులపై జరుగుతున్న హింసను వ్యతిరేకిస్తూ నార్వే దేశంలోని ముస్లింలు యూదుల ప్రార్ధన మందిరాల ముందు మనవహరంగా నిలబడి నిరసన తెలుపుతున్నప్పుడు తీసిన ఫోటో ఇది. ఈ ఫోటోకి స్వీడన్ దేశంలో జరిగిన అల్లర్లకి ఎలాంటి సంబంధం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, అదే ఫోటోని చూపుతూ ‘+972 Magazine’ వెబ్సైటు వారు ’23 ఫిబ్రవరి 2015’ నాడు పబ్లిష్ చేసిన ఒక ఆర్టికల్ దొరికింది. ఆర్టికల్ లో షేర్ చేసిన ఈ ఫోటో నార్వే దేశంలో జరిగిన నిరసనకి సంబంధించిందని అందులో తెలిపారు. డెన్మార్క్ దేశంలో యూదులపై జరుగుతున్న హింసను వ్యతిరేకిస్తూ నార్వే దేశంలోని ఓస్లో నగరంలో, ముస్లిం మతానికి చెందిన యువతులు ఇలా యూదుల ప్రార్ధన మందిరాల ముందు మనవహరంగా నిలబడి నిరసన తెలిపారని ఆర్టికల్ లో రాసారు.

పోస్టులో షేర్ చేసిన ఆ ఫోటోతో సహా మరికొన్ని ఫోటోలని చూపుతూ ‘INDEPENDENT’ న్యూస్ వెబ్సైటు వారు పబ్లిష్ చేసిన ఆర్టికల్ కూడా దొరికింది. ఈ ఆర్టికల్ లో కూడా ఆ ఫోటో నార్వే దేశంలో ముస్లిం మతానికి చెందిన వ్యక్తులు చేసిన నిరసనకు సంబంధించిందని అని తెలిపారు. “No to anti-Semitism, no to Islamophobia” అనే నినాదాలతో వేల మంది ముస్లిం యువతులు ఈ నిరసనలో పాల్గోన్నారని,  మనవహరంగా యూదుల ప్రార్ధన మందిరాల ముందు నిలబడి “ring of peace” కి ఇది నిదర్శనం అని తెలుపుతూ నిరసన చేసారని అందులో తెలిపారు.

ముస్లింల పవిత్ర గ్రంధమైన ఖురాన్ కాపీలను ఒక అతివాద పార్టీకి చెందిన సభ్యులు తగలపెట్టారని, స్వీడన్ దేశంలోని మల్మో నగరంలో వందలాది ముస్లింలు రోడ్లపైకి వచ్చి నిరసన తెల్పుతూ అల్లర్లకు పాల్పడ్డారు. పోలీసుల మీద రాళ్లు రువ్వడం, టైర్లు తగలపెట్టడం లాంటివి చేసారు. ‘25 ఆగష్టు 2020’ నాడు చోటు చేసుకున్న ఈ ఘటనలో ఆందోళకారులు పోలీసులపై రాళ్లు రువ్వడంతో పాటు రోడ్లపై టైర్లని తగలపెట్టారని ఒక ఆర్టికల్ లో తెలిపారు. స్వీడన్ దేశంలో జరిగిన ఈ హింసాత్మక ఘటనలు పొరుగు దేశమైన నార్వేకు వ్యాపించాయి. ‘26 ఆగష్టు 2020’ నాడు నార్వే రాజధాని ఓస్లోలోని పార్లమెంట్ భవనం ముందు చేసిన ఇస్లాం వ్యతిరేక ర్యాలీ లో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. కాని, పోస్టులో షేర్ చేసిన ఫోటో ఈ ఘర్షణకు సంబంధించినది కాదు.

చివరగా, నార్వే దేశానికి సంబంధించిన పాత ఫోటోని చూపుతూ స్వీడన్ దేశంలో జరిగిన అల్లర్లకు సంబంధించిందన ఫోటో అని తప్పుగా షేర్ చేస్తున్నారు.