2012 వీడియోని ఇప్పుడు రాజమండ్రిలోని రైల్వే బ్రిడ్జిపై పొంగుతున్న గోదావరి వరద అని షేర్ చేస్తున్నారు

ఇటీవల వర్షాలకు రాజమండ్రిలోని రైల్వే బ్రిడ్జిపై పొంగుతున్న గోదావరి అని చెప్తూ దీనికి సంబంధించిన వీడియో షేర్ చేసిన  పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఐతే ఇదే వీడియోను చూపిస్తూ ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు  తునిలోని తాండవ బ్రిడ్జి మునిగిపోయిందని కొన్ని వార్తా సంస్థలు ప్రచారం చేస్తున్నాయి, వీటిని ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: రాజమండ్రిలోని రైల్వే బ్రిడ్జిపై పొంగుతున్న గోదావరి వరద వీడియో.

ఫాక్ట్(నిజం): ఈ వీడియోని 2012 తుని వరదల్లో తాండవ బ్రిడ్జి మునిగిపోయిందన్న వివరణతో చాలా మంది యూట్యూబ్ లో అప్లోడ్ చేసారు. దీన్నిబట్టి ఈ వీడియోకి ఇటీవల కురుస్తున్న వర్షాలకు సంబంధం లేదని కచ్చితంగా చెప్పొచ్చు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

“tuni tandava bridge” అనే కీ వర్డ్స్ తో యూట్యూబ్ లో వెతకగా పోస్టులో ఉన్న వీడియోలోని విజువల్స్ పోలి ఉన్న వీడియో ఒక మాకు కనిపించింది. ఐతే ఈ వీడియో యూట్యూబ్ లో 04 నవంబర్ 2012న అప్లోడ్ చేయబడింది, ఇంకా ఈ వీడియో గురించిన వివరణ ఇలా ఉంది “Tuni flood water on Tandava railway bridge”. ఇదే వీడియోని తునిలోని తాండవ బ్రిడ్జి వరదలకి సంబంధించినదిగా చెప్తున్న కొన్ని 2012 వీడియోలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. దీన్నిబట్టి ఈ వీడియో పాతదని, ఇటీవల సమయంలో తీసింది కాదని కచ్చితంగా చెప్పొచ్చు.

“tuni tandava bridge floods 2012” అనే కీవర్డ్స్ తో గూగుల్ సెర్చ్ చేయగా నవంబర్ 2012న తుని వరదలకు సంబంధించిన కొన్ని వార్తా కథనాలు మాకు లభించాయి. వీటిని ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. ఐతే ఈ వార్తా కథనాలలో, తుని బ్రిడ్జి వరదలో పాక్షికంగా మునిగినట్టు రాసుంది, సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ వరదల్లో మునిగిపోయిన తుని తాండవ బ్రిడ్జిని సందర్శినట్టు రైల్వే వారు విడుదల చేసిన నోట్ మాకు కనిపించింది, ఇంకా ఈ వార్తను ప్రచురించిన వార్తా కథనం కనిపించింది.

పోస్టులో చూపిస్తున్న వీడియో వైరల్ అయినందున సౌత్ సెంట్రల్ రైల్వే వారు ఈ వీడియో పాతదని, తునిలో తాండవ బ్రిడ్జి సురక్షితంగా ఉందని, ప్రజలు ఎలాంటి వదంతులు నమ్మొద్దని ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసినట్టు రాసిన ఒక వార్తా కథనం మాకు కనిపించింది. వీటన్నిటిని బట్టి ఈ వీడియో ఇటీవల కురుస్తున్న వర్షాలకు సంబంధించింది కాదని కచ్చితంగా చెప్పొచ్చు.

ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో విస్తృతంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో పోస్టులో ఉన్న వార్తల లాంటి తప్పుదోవ పట్టించే వార్తలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు. 

చివరగా, 2012 వీడియోని ఇప్పుడు రాజమండ్రిలోని రైల్వే బ్రిడ్జిపై పొంగుతున్న గోదావరి వరద అని షేర్ చేస్తున్నారు. ఈ వీడియోకి ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో కురుస్తున్న వర్షాలకు సంబంధం లేదు.