2011లో నితిన్ గడ్కరి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న వీడియోని ఇప్పటిదిగా షేర్ చేస్తున్నారు

YouTube Poster

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక రాజ్యాంగ వ్యతిరేకి అని, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా రైతు ఉద్యమాలని అనిచివేయడానికి ప్రయత్నిస్తున్నట్టు బీజేపీ నాయకుడు నితిన్ గడ్కరి మీడియాకు తెలుపుతున్న ద్రుశ్యాలని సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ బడ్జెట్ సెషన్ లో ఉద్యమకారులని ‘Andolan Jeevi’ లుగా వర్ణించిన నేపథ్యంలో, ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: బీజేపీ నాయకుడు నితిన్ గడ్కరి ప్రధానమంత్రి నరేంద్ర మోది రాజ్యాంగ వ్యతిరేకి అని మీడియాకు తెలుపుతున్న ద్రుశ్యాలు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఈ వీడియో పాతది. 2011 లో జరిగిన ఒక మీడియా సమావేశంలో బీజేపీ నాయకుడు నితిన్ గడ్కరి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ని విమర్శిస్తున్న వీడియో ఇది. కాంగ్రెస్  ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా అన్నా హజారేను అరెస్ట్ చేసినట్టు నితిన్ గడ్కరి ఈ ప్రెస్ మీట్ లో తెలిపారు. ఈ వీడియోకి రైతులు వ్యవసాయ చట్టాలకి వ్యతిరేకంగా చేస్తున్న నిరసనలకి ఎటువంటి సంబంధం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో లోని 0.08 నుండి 0.38 సెకెన్ల వ్యవధిలో నితిన్ గడ్కరి, కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉద్యమాలని అణిచివేస్తునట్టు తెలిపారు. అలాగే, అన్నా హజారే చేస్తున్న నిరాహారదీక్షని  ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా అణిచివేసినట్టు తెలిపారు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో గురించి వెతికితే, ఇవే ద్రుశ్యాలు కలిగిన వీడియోని BJP తమ అధికారిక యూట్యూబ్ ఛానెల్లో పబ్లిష్ చేసినట్టు తెలిసింది. BJP ఈ వీడియోని 16 ఆగష్టు 2011 నాడు పబ్లిష్ చేసింది. 15 ఆగష్టు 2011 నాడు BJP నిర్వహించిన ప్రెస్ మీట్ కి సంబంధించిన వీడియో అని వివరణలో తెలిపారు.

BJP 15 ఆగష్టు 2011 నాడు నిర్వహించిన ఈ ప్రెస్ మీట్ కు సంబంధించి ‘The Economic Times’ ఆర్టికల్ పబ్లిష్ చేసింది. అన్నా హజారే నిరాహారదీక్షని కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రజాస్వామ్య  వ్యతిరేకంగా అణిచివేసినట్టు, నితిన్ గడ్కరి ఈ ప్రెస్ మీట్ లో తెలిపారు. ఇదే విషయాన్నీ తెలుపుతూ ‘India Today’ 16 ఆగష్టు 2011 నాడు ఆర్టికల్ పబ్లిష్ చేసింది.

చివరగా, 2011 లో నితిన్ గడ్కరి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న వీడియోని రైతు ఉద్యమాలకి ముడిపెడుతున్నారు.