2011 రిపబ్లిక్ డే పెరేడ్ లో బీహార్ ప్రభుత్వం ప్రదర్శించిన శకటాన్ని అఖిలేష్ యాదవ్‌కి ముడిపెడుతున్నారు

గణతంత్ర దినోత్సవ వేడుకలలో ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, ప్రస్తుత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాలు ప్రదర్శించిన శకటాల చిత్రాలు, అని చెప్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. ముస్లిం వ్యక్తి ప్రార్థన చేస్తున్నట్టుగా ఉన్న శకటాన్ని అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం ప్రదర్శించిందని, అయోధ్య రామ మందిరం మోడల్ లో నిర్మించిన శకటం యోగి ప్రభుత్వం ప్రదర్శించినదని ఈ పోస్టులో చెబుతున్నారు. మైనారిటీ ల వోట్ల కోసం రాష్ట్ర గౌరవాన్ని తాకట్టు పెట్టిన సూడో సెక్యులర్ పార్టిలంటూ ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: రిపబ్లిక్ డే పెరేడ్ లో ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాలు ప్రదర్శించిన శకటాల చిత్రాలు.

ఫాక్ట్ (నిజం): ముస్లిం వ్యక్తి ప్రార్థన చేస్తున్నట్టుగా నిర్మించిన శకటాన్ని, బీహార్ ప్రభుత్వం 2011 గణతంత్ర దినోత్సవ వేడుకలో ప్రదర్శించింది. అయోధ్య రామ మందిరం మోడల్ లో నిర్మించిన ఫోటోలోని శకటాన్ని ఇటివల యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం రిపబ్లిక్ డే పెరేడ్ లో ప్రదర్శించారు. ముస్లిం వ్యక్తి ప్రార్థన చేస్తునట్టుగా ఉన్న శకటానికి అఖిలేష్ యాదవ్ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

ఫోటో-1:

పోస్టులో షేర్ చేసిన ఈ ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే దృశ్యం కలిగిన ఫోటోని News18 న్యూస్ వెబ్ సైట్ పబ్లిష్ చేసినట్టు తెలిసింది. బీహార్ ప్రభుత్వం 2011 గణతంత్ర దినోత్సవ పెరేడ్ లో ప్రదర్శించిన శకటం ఫోటో అని ఆర్టికల్ లో తెలిపారు. 17వ శతాబ్దానికి చెందిన మఖ్దుం షా దౌలత్ రూపంలో బీహార్ ప్రభుత్వం ఈ శకటాన్ని నిర్మించినట్టు అందులో తెలిపారు. ‘India Today’ న్యూస్ వెబ్ సైట్ 2011 గణతంత్ర దినోత్సవ వేడుకలకి సంబంధించి పబ్లిష్ చేసిన గ్యాలరీ లో కూడా ఈ ఫోటో దొరికింది.

2011 రిపబ్లిక్ డే పెరేడ్ దృశ్యాలు కలిగిన వీడియోని ‘Prasar Bharati’ ఛానల్ తమ యూట్యూబ్ ఛానల్ లో పబ్లిష్ చేసింది. ముస్లిం వ్యక్తి ప్రార్థన చేస్తున్నట్టుగా ఉన్న శకటాన్ని ఈ వీడియోలో చూడవచ్చు. 2011 గణతంత్ర దినోత్సవ వేడుకలకి సంబంధించి India Archives యూట్యూబ్ చానెల్ పబ్లిష్ చేసిన వీడియోలో కూడా మనం ఈ శకటాన్ని చూడవచ్చు.

ఫోటో-2:

పోస్టులో షేర్ చేసిన ఈ ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే ఫోటోని షేర్ చేస్తూ చాలా న్యూస్ వెబ్ సైట్స్ ఆర్టికల్స్ పబ్లిష్ చేసినట్టు తెలిసింది. అవి ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. 2021 గణతంత్ర దినోత్సవ వేడుకలో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం అయోధ్య రామ మందిర ఆకృతిలో ఉన్న శకటాన్ని ప్రదర్శించినట్టు తెలిపారు.

చివరగా, 2011 రిపబ్లిక్ డే పెరేడ్ లో బీహార్ ప్రభుత్వం ప్రదర్శించిన శకటాన్ని అఖిలేష్ యాదవ్ హయాంలో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం తరుపున ప్రదర్శించిన శకటంగా షేర్ చేస్తున్నారు.