పోస్ట్ లో చెప్పినట్టు 2019 లోక్ సభ ఎన్నికలల్లో BJP తరపున 130 మంది SC, ST ఎంపీలు ఎన్నిక కాలేదు

బీజేపీ 130 దళిత ఎంపీలు (84 ఎస్సీ & 46 ఎస్టీ) గెలిచిన పార్టీ అని, మిగిలిన పార్టీల్లో ఇంతకంటే తక్కువే  ఉన్నారని ఫేస్బుక్ లో ఒక పోస్ట్ వైరల్ అవుతుంది . ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): 2019 లోక్ సభ ఎన్నికలల్లో BJP తరపున 130 మంది SC, ST ఎంపీలు ఎన్నిక అయ్యారు.

ఫాక్ట్ (నిజం): 2019 లోక్ సభ ఎన్నికలల్లో BJP తరపున 130 మంది SC, ST ఎంపీలు ఎన్నిక కాలేదు. బీజేపీ లో కేవలం 46 ఎస్సీ, 34 ఎస్టీ ఎంపీ లు మాత్రమే ఉన్నారు. కావున పోస్టు ద్వారా చెప్పింది తప్పు.

2019 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 542 స్థానాలకు గాను 303 స్థానాలలో గెలుపొందింది. అందులో ఎస్సీలకు కేటాయించబడిన 84 స్థానాలలో 46  స్థానాలు గెలిస్తే, ఎస్టీలకు  కేటాయించబడిన 47 స్థానాలలో  31  స్థానాలు గెలిపొందారు. అంటే మొత్తం 131 రిజర్వ్ (84 ఎస్సీ, 47 ఎస్టీ) స్థానాలలో 77 సీట్లు గెలుపొందింది. మిగిలిన 226 (303-77 రిజర్వడ్) జనరల్ స్థానాలలో బీజేపీ తరపున గెలుపొందిన అభ్యర్థుల వివరాల కోసం ఎన్నికల సంఘం వెబ్సైట్ లో  వారి  అఫిడవిట్లు  వెతకగా,  కేవలం ముగ్గురే (కిరణ్ రిజుజు, తపిర్ గావో, మనసుఖ్ భాయ్ ధంజిభాయ్ వాసవ )  ఎస్టీ అభ్యర్థులు ఉన్నారు. ఎస్సీ అభ్యర్థులు ఎవరూ లేరు.అంటే BJP లో కేవలం 46 ఎస్సీ, 34 ఎస్టీ ఎంపీలు మాత్రమే ఉన్నారు.

ఉదాహరణకు అరుణాచల్ ప్రదేశ్ లోని అరుణాచల్ ప్రదేశ్  ఈస్ట్ జనరల్ నియోజకవర్గం లో అక్కడ గెలిచిన తపిర్ గావో  ఎలక్షన్ అఫిడవిట్  లోని 3వ పార్ట్ లో  అతను ST కి చెందిన వాడిగా అతను ప్రకటించుకున్నాడు.

చివరగా, బీజేపీ 130 దళిత ఎంపీలు (84 ఎస్సీ & 46 ఎస్టీ) గెలిచిన పార్టీ అని పోస్ట్ లో చెప్పిన దాంట్లో నిజం లేదు. బీజేపీ లో కేవలం 46 ఎస్సీ, 34 ఎస్టీ ఎంపీ లు మాత్రమే ఉన్నారు.