కాంగ్రెస్ ప్రభుత్వం పెట్రోల్ మీద చేసిన అప్పులకు సంబంధించి మోదీ ప్రభుత్వం ప్రతీ సంవత్సరం ఇరవై వేల కోట్లు చెల్లిస్తుందని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: కాంగ్రెస్ ప్రభుత్వం పెట్రోల్ మీద చేసిన అప్పులకు సంబంధించి మోదీ ప్రభుత్వం ప్రతీ సంవత్సరం ఇరవై వేల కోట్లు చెల్లిస్తుంది.
ఫాక్ట్ (నిజం): గత ప్రభుత్వాలు ఇష్యూ చేసిన ఆయిల్ బాండ్లకు సంబంధించి 2014 నుండి 2021 వరకు మోదీ ప్రభుత్వం మెచ్యూర్ అయిన ఆయిల్ బాండ్లకు రూ. 3,500 కోట్లు చెల్లించగా, ఆయిల్ బాండ్లకి చెల్లించాల్సిన వడ్డీ రూపంలో సుమారు రూ. 70,196 కోట్ల రూపాయలు చెల్లించింది. ఈ రెండు కలుపుకొని ఇప్పటివరకి మొత్తం రూ. 73,696 కోట్ల చెల్లించింది. అనగా మోడీ ప్రభుత్వం ఈ ఏడు సంవత్సరాలలో సగటున సంవత్సరానికి రూ. 10,528 కోట్ల చెల్లించింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
మెచ్యూర్ అయిన బాండ్స్ కి చెల్లించినవి:
గత కాంగ్రెస్ ప్రభుత్వం అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగినప్పుడు ఈ పెరిగిన మొత్తాన్ని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMC) వినియోగదారుడికి బదలాయించకుండా ఉండేందుకు ఈ కంపెనీలు భరించాల్సిన నష్టానికి అనుగుణంగా నిర్ణిత వడ్డీ రేట్ చొప్పున 10 నుండి 20 సంవత్సరాల మెచ్యూరిటీ పీరియడ్ గల ఆయిల్ బాండ్స్ ఇష్యూ చేసాయి.
2014-15 బడ్జెట్ లెక్కల ప్రకారం మోదీ ప్రభుత్వం మొదటిసారి అధికారంలోకి వచ్చే సమయానికి గత ప్రభుత్వాలు పెట్రోల్ పై చేసిన అప్పులలో కేవలం ఆయిల్ బాండ్స్ రూపంలో రూ. 1,34,423 కోట్లు బాకీ ఉన్నాయి. ఇందులో ఒక్కొక్క బాండ్ ఒక్కో సంవత్సరంలో మెచ్యూర్ అవుతుండడంతో ఈ మొత్తం ఒక్కసారే కట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ బాండ్లకు సంబంధించి ప్రతీ సంవత్సరం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.
మోదీ మొదటిసారి ప్రధానమంత్రి అయినప్పటినుండి ఇప్పటివరకు కేవలం రెండు బాండ్లు మాత్రమే మెచ్యూర్ అయ్యాయి. 2015లో రూ. 1750 కోట్ల విలువ గల రెండు బాండ్లు మెచ్యూర్ అవ్వడంతో మోదీ ప్రభుత్వం ఈ బాండ్లకు సంబంధించి మొత్తం రూ. 3500 కోట్లు చెల్లించింది. ఈ సంవత్సరం అక్టోబర్ మరియు నవంబర్ లో రూ. 5000 కోట్లు గల రెండు బాండ్స్ మెచ్యూర్ అవ్వాల్సి ఉంది. వీటికి ప్రభుత్వం రూ. 10,000 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది.
ఆయిల్ బాండ్స్ కి చెల్లించిన వడ్డీలు:
2014 నుండి 2021 వరకు మోదీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్లలోని సమాచారం ప్రకారం ఇప్పటి వరకు మోదీ ప్రభుత్వం ఆయిల్ బాండ్స్ పై వడ్డీ రూపంలో సుమారు రూ. 70,196 కోట్ల రూపాయలు చెల్లించింది. 2021-22 సంవత్సరానికి గాను సుమారు రూ. 9990 కోట్లు చెల్లించనుంది.
అంటే మెచ్యూర్ అయిన ఆయిల్ బాండ్స్ కి చెల్లించిన రూ. 3500 కోట్లు, వడ్డీ రూ. 70,196 కోట్ల మొత్తం కలుపుకొని 2014 నుండి 2021 వరకు రూ. 73,696 కోట్ల చెల్లించింది, అనగా మోదీ ప్రభుత్వం ఈ ఏడు సంవత్సరాలలో సగటున సంవత్సరానికి రూ. 10,528 కోట్ల చెల్లించింది, పోస్టులో చెప్తున్నట్టు ఇరవై వేల కోట్లు కాదు.
చివరగా, గత ప్రభుత్వాలు ఇష్యూ చేసిన ఆయిల్ బాండ్స్ కి సంబంధించి 2014 నుండి ఇప్పటివరకు మోదీ ప్రభుత్వం సగటున సంవత్సరానికి రూ. 10,528 కోట్ల చెల్లించింది.