Fake News, Telugu
 

ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తే నేరం కాదని కేరళ లేదా కర్ణాటక హైకోర్టులు వ్యాఖ్యలు చేయలేదు

0

ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేయడం నేరమేమి కాదని కేరళ హైకోర్టు ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసింది, అంటూ ఒక వార్తా పత్రిక కథనం యొక్క స్క్రీన్ షాట్‌ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కొన్ని వార్తా సంస్థలు ఇదే విషయాన్ని రిపోర్ట్ చేస్తూ ఆర్టికల్స్ కూడా ప్రచురించాయి. లంచం డిమాండ్ చేయవచ్చు కానీ, లంచం తీసుకోవడం మాత్రం నేరమని కేరళ హైకోర్టు వ్యాఖ్యలు చేసినట్టు ఈ పోస్టులలో తెలుపుతున్నారు. ఆ పోస్టులలో ఎంతవరకు నిజముందో చూద్దాం. 

క్లెయిమ్:  ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేయడం నేరం కాదని కేరళ హైకోర్టు ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఫాక్ట్: కర్ణాటకలో ఒక రెవెన్యూ అధికారిపై ACB చేసిన అవినీతి ఆరోపణలను కొట్టిపారేస్తూ కర్ణాటక హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుని కొన్ని వార్తా సంస్థలు తప్పుగా అర్ధం చేసుకొని ఈ ఆర్టికల్స్ ప్రచురించాయి. ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేయడం నేరం కాదని కర్ణాటక లేదా కేరళ హైకోర్టులు ఎన్నడూ వ్యాఖ్యలు చేయలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

పోస్టులో చేస్తున్న క్లెయిమ్‌కు సంబంధించిన వివరాల కోసం కొన్ని పదాలని ఉపయోగించి ఇంటర్నెట్లో వెతికితే, ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తే నేరం కాదని తెలుపుతూ కేరళ హైకోర్టు ఇటీవల ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని తెలిసింది.

పోస్టులో షేర్ చేసిన వార్తా కథనంలో చిత్రదుర్గ జిల్లాకు చెందిన వ్యక్తి ఒక ప్రభుత్వ ఉద్యోగిపై చేసిన ఆరోపణలను కొట్టిపారేస్తూ హైకోర్టు ఈ తీర్పు వెల్లడించిందని రిపోర్ట్ చేశారు. చిత్రదుర్గ కర్ణాటక రాష్ట్రానికి చెందిన జిల్లా. ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకోవడం తప్పు కాదని కర్ణాటక హైకోర్టు ఇటీవల ఏమైనా తీర్పు వెల్లడించిందా అని వెతికితే, చిత్రదుర్గ జిల్లా హోసదుర్గలో పనిచేస్తున్న ఒక రెవెన్యూ అధికారిపై అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు చేసిన అవినీతి ఆరోపణలను కొట్టిపారేస్తూ కర్ణాటక హైకోర్టు ఇటీవల ఒక తీర్పు వెల్లడించిందని తెలిసింది.

చిత్రదుర్గ జిల్లాలో సబ్-రిజిస్ట్రార్‌గా భాధ్యతలను నిర్వర్తిస్తున్న మంజునాథ్, 24 ఫిబ్రవరి 2022 నాడు DH దుర్గా ప్రసాద్ అనే వ్యక్తి  ఇచ్చిన ఇంటి రిజిస్ట్రేషన్‌ ధరఖాస్తుని ఆమోదించి అదే రోజు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్‌ని అతనికి అందజేసినట్టు తెలిసింది. అయితే, రిజిస్ట్రేషన్ పని పూర్తయిన వారం రోజులకు, 02 మార్చి 2022 నాడు, మంజునాథ్ తన ఇంటి రిజిస్ట్రేషన్ కోసం 5000 రూపాయిలు లంచంగా అడుగుతున్నాడని దుర్గా ప్రసాద్ అప్పటి ACB, ప్రస్తుత లోకయుక్త సంస్థ, అధికారులకి కంప్లయింట్ ఇచ్చినట్టు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ రిపోర్ట్ చేసింది. కంప్లయింట్ తీసుకున్న రెండు నెలల తరువాత ACB, దుర్గా ప్రసాద్ చేత మంజునాథ్‌కు 4000 రూపాయిల లంచం అందచేసి, ఆ లంచం డబ్బులు అతని టేబుల్ పై ఉన్నప్పుడు పకడ్బంధీగా పట్టుకొని సెక్షన్ 7(A) – ప్రివెన్షన్ అఫ్ కరప్షన్ యాక్ట్ నేరం కింద అరెస్ట్ చేసింది. మంజునాథ్ లంచం డబ్బులని చేతిలో పట్టుకున్నప్పుడు ACB అధికారులు అతన్ని పట్టుకోలేదు.

ACB తనపై చేసిన అవినీతి ఆరోపణలని ప్రశ్నిస్తూ మంజునాథ్ కర్ణాటక హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు. కర్ణాటక హైకోర్టు ఈ కేసుకి సంబంధించి 16 నవంబర్ 2022 నాడు ఇచ్చిన తీర్పులో, అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 07లో పోస్ట్-పెయిడ్ కాన్సెప్టుని ఎక్కడా ప్రస్తావించలేదని, ఏదైన పని జరగకముందే ఆ పని జరగడం లేదా ఆమోదించడం కోసం డబ్బులని ఆశించడాన్ని సెక్షన్ 07 కింద నేరంగా పరిగణిస్తారని కర్ణాటక హైకోర్టు తెలిపింది. కోర్టుకి సమర్పించిన ఆధారాల ప్రకారం దుర్గా ప్రసాద్‌ 24 ఫిబ్రవరి 2022 నాడు ఇచ్చిన తన ఇంటి రిజిస్ట్రేషన్ దరఖాస్తుని మంజునాథ్ అదే రోజు ఆమోదించి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్‌ని కూడా అందజేసినట్టు స్పష్టంగా రుజువయ్యిందని కోర్టు తెలిపింది. మంజునాథ్‌పై ACB చేసిన అవినీతి ఆరోపణలను కర్ణాటక హైకోర్టు కొట్టిపారేస్తూ, “చట్టంలో సెక్షన్ 7 ఒక పని చేయడం లేదా అంగీకారం కోసం ముందస్తు డబ్బు చెల్లింపు డిమాండ్‌ను స్పష్టంగా సూచిస్తుంది. సెక్షన్ 7 కింద పోస్ట్-పెయిడ్ కాన్సెప్ట్ ఏదీ లేదు,” అని తెలిపింది. 24 ఫిబ్రవరి 2022 నాడు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ విడుదల చేయడానికి పిటిషనర్ లంచం తీసుకున్నట్లు ఒకవేళ దుర్గా ప్రసాద్‌ ఫిర్యాదు చేసివుంటే కేసు తీర్పు మరోలా ఉండేదని కోర్టు తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకుంటే నేరం కాదని కర్ణాటక హైకోర్టు ఈ తీర్పులో ఎక్కడ తెలుపలేదు. ప్రభుత్వ కార్యాలయాలలో జరుగుతున్న అవినీతిని కర్ణాటక మరియు కేరళ హైకోర్టులు పలు సార్లు ఖండిస్తూ వ్యాఖ్యలు చేసాయి.

చివరగా, ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తే నేరం కాదని కేరళ లేదా కర్ణాటక హైకోర్టులు వ్యాఖ్యలు చేయలేదు.

Share.

About Author

Comments are closed.

scroll