YSRCP ఎన్నికల మేనిఫెస్టో విడుదల కార్యక్రమాన్ని చంద్రబాబు చూస్తున్నట్లుగా షేర్ చేస్తున్న ఈ ఫోటో మార్ఫింగ్ చేయబడింది

27 ఏప్రిల్ 2024న ఏపీ సీఎం, YSRCP అధినేత వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి YSRCP 2024 అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు. ఈ ఎన్నికల మేనిఫెస్టో విడుదల కార్యక్రమాన్ని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చూస్తున్నట్లుగా ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది(ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఇలాంటి మరిన్ని పోస్టుల యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ & ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: YSRCP ఎన్నికల మేనిఫెస్టో విడుదల కార్యక్రమాన్ని చూస్తున్న చంద్రబాబు నాయుడు ఫోటో.

ఫాక్ట్(నిజం): ఈ వైరల్ ఫోటో మార్ఫింగ్ చేయబడింది. 26 నవంబర్ 2017న చంద్రబాబు నాయుడు రియల్ టైమ్ గవర్నెన్స్ స్టేట్ సెంటర్ ను ప్రారంభించినప్పడు తీసిన ఫోటోను మార్ఫ్ చేసి ఈ వైరల్ ఫోటో రూపొందించారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వైరల్ ఫోటోకు సంబంధించిన సమాచారం కోసం, గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇలాంటి దృశ్యాలనే చూపిస్తున్న ఫోటో ఒకటి లభించింది. ఈ ఫోటోను నారా చంద్రబాబు నాయుడు యొక్క అధికారిక ఫేస్‌బుక్ పేజీ 26 నవంబర్ 2017న పోస్ట్‌ చేసింది. ఈ ఫోటో వివరణలో, “ఈ రోజు సచివాలయలోని మొదటి బ్లాక్‌లో రియల్ టైమ్ గవర్నెన్స్ స్టేట్ సెంటర్ ప్రారంభించాను. సుసంపన్నమైన మరియు సాంకేతికంగా అభివృద్ధి చెందిన ఈ కేంద్రం నిఘా విభాగం, ఫిర్యాదుల పరిష్కారం, ప్రకృతి వైపరీత్యాల సమయంలో పౌరులను హెచ్చరిక చేసే వ్యవస్థలు మొదలైనవాటిని ఇ-గవర్నెన్స్, టెక్నాలజీ మరియు ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్‌లకు సమకాలీకరించబడిన వేదికగా పనిచేస్తుంది. ఇది 13 జిల్లాల్లో, రాష్ట్రంలోని అన్ని కుటుంబాల డేటాను సమర్ధవంతమైన పాలనతో వారి జీవితాలను ప్రభావితం చేయడానికి, ‘పీపుల్ ఫస్ట్’మంత్రానికి భరోసానిచ్చే పర్యావరణ వ్యవస్థగా కూడా పని చేస్తుంది”. 26 నవంబర్ 2017న ఈ రియల్ టైమ్ గవర్నెన్స్ స్టేట్ సెంటర్ ప్రారంభం గురించి రిపోర్ట్ చేస్తున్న పలు వార్త కథనాలు ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ చూడవచ్చు.

వైరల్ ఫోటోను, ఈ ఫేస్‌బుక్ ఫోటోను పోల్చి చూస్తే, వైరల్ ఫోటోలో చంద్రబాబు ముందు ఉన్న స్క్రీన్‌పై వై.ఎస్. జగన్ చిత్రం తప్ప మిగతావన్నీ ఒకేలా ఉండడం గమనించవచ్చు. దీన్ని బట్టి 2017లో చంద్రబాబు రియల్ టైమ్ గవర్నెన్స్ స్టేట్ సెంటర్ ప్రారంభించినప్పటి ఫోటోను మార్ఫింగ్ చేసి ఈ వైరల్ ఫోటో రూపొందించారని నిర్ధారించవచ్చు.

చివరగా, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు YSRCP ఎన్నికల మేనిఫెస్టో విడుదల కార్యక్రమాన్ని చూస్తున్నారని షేర్ చేస్తున్న ఈ వైరల్ ఫోటో మార్ఫింగ్ చేయబడింది.