2013-14 లో కేవలం 80 లక్షల మంది కాదు, సుమారు 5 కోట్ల మంది ఆదాయపు పన్ను కట్టారు

మోడీ అధికారంలోకి వచ్చాక ఆదాయపు పన్ను కట్టేవారి సంఖ్య పది రెట్లకంటే ఎక్కువ పెరిగిందని చెప్తూ కొన్ని సంఖ్యలతో ఉన్న ఒక పోస్ట్ ని ఫేస్బుక్ లో కొందరు షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): 2014 లో భారత్ లో ఆదాయపు పన్ను కట్టేవారి సంఖ్య: 80 లక్షలు. 2019 లో ఆ సంఖ్య: 8 కోట్ల 80 లక్షలు.

ఫాక్ట్ (నిజం): 2013-14 లో ‘Individual’ కేటగిరీ లోనే సుమారు 5 కోట్ల మంది వరకు పన్ను కట్టే వాళ్ళు ఉన్నట్టు ఆదాయపు పన్ను విభాగం వారు రిలీజ్ చేసిన రిపోర్ట్ లో చూడవచ్చు. కావున పోస్ట్ లో చెప్పింది అబద్ధం.

పోస్ట్ లోని విషయం గురించి గూగుల్ లో ‘Number of Taxpayers India’ అని వెతకగా, ఆదాయపు పన్ను విభాగం (Income Tax Department) వారు తమ వెబ్ సైట్ లో ఈ విషయం పై డేటా పెట్టినట్టు తెలుస్తుంది. వారు వెబ్ సైట్ లో పెట్టిన రిపోర్ట్ (Income Tax Department Time Series Data Financial Year 2000-01 to 2017-18) చూస్తే 2013-14 లో పన్ను కట్టే వారి సంఖ్య సుమారు ఐదు కోట్ల ఇరవై లక్షలని ఉంటుంది. అంతే కాదు, ఒక వేల పోస్ట్ లో కేవలం ‘Individual’ (వ్యక్తిగత) కేటగిరీ గురించి ఇచ్చారా అని చూస్తే కూడా 2013-14 లో ‘Individual’ కేటగిరీ లోనే ఐదు కోట్ల మంది వరకు పన్ను కట్టే వారు ఉన్నారు. ఆ రిపోర్ట్ లో 2018-19 డేటా ఉండదు కానీ 2017-18 లో మాత్రం సుమారు ఏడు కోట్ల నలబై లక్షల మంది వరకు పన్ను కట్టినట్టు ఉంటుంది.

రిపోర్ట్ లోనే కాదు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా గత సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం నాడు ఇచ్చిన స్పీచ్ లో 2013 లో నాలుగు కోట్ల మంది డైరెక్ట్ టాక్స్ కట్టే వారని చెప్పారు.

చివరగా, 2013-14 లో కేవలం 80 లక్షల మంది కాదు, సుమారు ఐదు కోట్ల మంది ఆదాయపు పన్ను కట్టేవారు ఉండే.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?