Fake News, Telugu
 

‘19 ఏళ్ల కిందటి ఫోన్…70% చార్జింగ్ తో స్విచ్చాఫ్ కాకుండా దొరికింది’ అని వస్తున్న వార్తల్లో నిజంలేదు

0

ఇంగ్లాండ్ లో ఒక వ్యక్తికి తను 19 ఏళ్ళ ముందు కొన్న ఫోన్ టేబుల్ డ్రాలో స్విచ్చాఫ్ కాకుండా దొరికిందని, విచిత్రం ఏమిటంటే ఆ ఫోన్ లో ఇంకా 70 శాతం ఛార్జింగ్ మిగిలి ఉందని చెప్తూ ఒక పోస్ట్ ని సోషల్ మీడియా లో చాల మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ‘19 ఏళ్ల కిందటి ఫోన్…70% చార్జింగ్ తో స్విచ్చాఫ్ కాకుండా దొరికింది’. 

ఫాక్ట్ (నిజం): వ్యంగ్యంగా వార్తలు రాసే వెబ్సైటు లో ప్రచురించిన వార్తని తీసుకొని నిజంగా జరిగినట్టు షేర్ చేస్తున్నారు. ఫోటోలోని వ్యక్తి 2017 లో ఒక వార్తాపత్రికతో మాట్లాడుతూ తను 17 ఏళ్ళ కింద ఆ ఫోన్ కొన్నానని, మధ్యలో కొన్ని ఏళ్ళు ఆ ఫోన్ వాడలేదని చెప్పాడు, కానీ పోస్ట్ లో చెప్పినట్టుగా తన ఫోన్ 70% ఛార్జింగ్ తో స్విచ్చాఫ్ కాకుండా దొరికిందని చెప్పలేదు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

ఈ విషయం గురించి వెతికినప్పుడు, సోషల్ మీడియాలోనే కాదు ప్రముఖ వార్తాసంస్థలు [HMTV (ఆర్కైవ్డ్ వెర్షన్) మరియు V6 వెలుగు (ఆర్కైవ్డ్ వెర్షన్)]  కూడా ఈ వార్తను ప్రచురించినట్టుగా చూడవచ్చు.

పోస్ట్ లోని ఫోటోని యాన్డెక్స్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, అదే ఫోటోతో 2017 లో ‘Express.co.uk’ వెబ్ సైట్ లో ప్రచురించిన ఒక ఆర్టికల్ దొరుకుతుంది. ఆ ఆర్టికల్ లో ఫోటోలోని వ్యక్తి పేరు ‘డేవ్ మిచెల్ ’ అని, 2000 లో కొన్న నోకియా 3310 ఫోన్ ని తను ఇంకా వాడుతున్నాడని ఉంటుంది. మధ్యలో కొన్ని ఏళ్ళు తను ఆ ఫోన్ వాడనట్టు ఆ ఆర్టికల్ లో ఉంటుంది. కానీ ఆ ఫోన్ కనబడకుండా పోయిందని, దొరకినప్పుడు అది స్విచ్చాఫ్ కాకుండా 70% చార్జింగ్ తో దొరికిందని తను చెప్పినట్టు ఆ ఆర్టికల్ లో ఉండదు. 2017 లో ఈ వార్తను ఇండియన్ వార్తాసంస్థలు కూడా ప్రచురించినట్టు ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవచ్చు.

ఈ వార్త పై మరింత సమాచారం కోసం గూగుల్ లో వెతకగా, సోషల్ మీడియాలో వైరల్ వార్తను వ్యంగ్యంగా వార్తలు రాసే ‘Chester Bugle’ అనే వెబ్సైటు నుండి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సోషల్ మీడియా మరియు వార్తాపత్రికల్లో ఆ వ్యక్తీ పేరు ‘కెవిన్ మూడీ’ (అసలు పేరు – ‘డేవ్ మిచెల్’) అని ఉంటుంది, ఆ పేరును కూడా ఈ వెబ్ సైట్ లో చూడొచ్చు. కావున, వ్యంగ్యంగా రాసిన ఒక ఆర్టికల్ ని తీసుకొని నిజమైన వార్తగా షేర్ చేస్తున్నారు.

చివరగా, ‘19 ఏళ్ల కిందటి ఫోన్…70% చార్జింగ్ తో స్విచ్చాఫ్ కాకుండా దొరికింది’ అని వస్తున్న వార్తల్లో నిజంలేదు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll