Fake News, Telugu
 

హైదరాబాద్ లో 5 రూపాయల భోజనం పథకానికి అయ్యే ఖర్చు మొత్తాన్ని తెలంగాణా ప్రభుత్వం, జీ.హెచ్.ఎం.సీ మరియు అక్షయ పాత్ర ఫౌండేషన్ మూడూ పంచుకుంటాయి

0

కొంతమంది ఫేస్బుక్ పోస్ట్ లో ఒక వీడియో పెట్టి ‘5 రూపాయల భోజనం పెడుతున్నది ఎవరో చూసి వినండి…? తెలుసుకోండి అప్పుడు #జయలలిత పెట్టలేదు ఇప్పుడు #కేసిఆర్…..#చెంద్రబాబు పెట్టండంలేదు …? నిజం తెలుసుకోండి వీడియో చూసి’ అంటూ ఆరోపిస్తున్నారు. పోస్ట్ లో పెట్టిన  వీడియోలో ఒక వ్యక్తి హైదరాబాద్ లో 5 రూపాయల భోజనం పథకానికి అయ్యే ఖర్చు మొత్తాన్ని హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ (అక్షయ పాత్ర ఫౌండేషన్) భరిస్తుందని , జీ.హెచ్.ఎం.సీ అందుకు కావాల్సిన స్థలాన్ని మాత్రమే ఇస్తుందని మరియు రాష్ట్ర ప్రభుత్వం కేవలం ప్యాకేజింగ్ మాత్రమే చేస్తుందని  పేర్కొన్నాడు. వాటిల్లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): హైదరాబాద్ సిటీలో 5 రూపాయల భోజనం పథకానికి అయ్యే ఖర్చు మొత్తాన్ని హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ (అక్షయ పాత్ర ఫౌండేషన్) భరిస్తుంది. 

ఫాక్ట్ (నిజం): హైదరాబాద్ సిటీలో 5 రూపాయల భోజనం పథకానికి అయ్యే ఖర్చు మొత్తాన్ని తెలంగాణా ప్రభుత్వం, జీ.హెచ్.ఎం.సీ మరియు అక్షయ పాత్ర ఫౌండేషన్ మూడూ పంచుకుంటాయి. కావున, పోస్ట్ లో చేసిన ఆరోపణల్లో ఎటువంటి నిజం లేదు.    

హైదరాబాద్ నగరంలో 5 రూపాయల భోజనం పథకం గురించి గూగుల్ లో వెతకినప్పుడు, “The Hindu” వారు రాసిన ఒక ఆర్టికల్ లభించింది. దాని ప్రకారం, 2014లో జీ.హెచ్.ఎం.సీ వారు హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ (అక్షయ పాత్ర ఫౌండేషన్) వారితో భాగస్వామ్యులై ఈ పథకాన్ని ప్రారంభించారు. ఇదే విషయం గురించి సమాచారం కోసం అక్షయ పాత్ర ఫౌండేషన్ వారిని సంప్రదించగా, వారు ‘5 రూపాయల భోజనాన్ని’ జి.హెచ్.ఎమ్.సి వారితో  కలిసి చేస్తున్నాం అని, అందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం (MoU) చేసుకున్నాం అని తెలిపారు. ఈ పథకానికి అయ్యే మొత్తం ఖర్చులో ఎవరు ఎంత భరిస్తున్నారనే విషయం గురించి జీ.హెచ్.ఎం.సీ కార్యాలయాన్ని సంప్రదించగా, వారు 60 శాతం ఖర్చుని జీ.హెచ్.ఎం.సీ మరియు రాష్ట్ర ప్రభుత్వం పెడుతుందని, మిగతా 40 శాతాన్ని అక్షయ పాత్ర ఫౌండేషన్ పెడుతుందని తెలిపారు. కావున, పోస్టులో పెట్టిన వీడియోలో చెప్పినట్లుగా, 5 రూపాయల భోజనం పథకానికి అయ్యే ఖర్చు మొత్తాన్ని హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ భరిస్తుందనే విషయంలో నిజం లేదు.

చివరగా, హైదరాబాద్ నగరంలో 5 రూపాయల భోజనం పథకానికి అయ్యే ఖర్చు మొత్తాన్ని తెలంగాణా ప్రభుత్వం, జీ.హెచ్.ఎం.సి మరియు అక్షయ పాత్ర ఫౌండేషన్ మూడూ పంచుకుంటాయి.  

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?


Share.

About Author

Comments are closed.

scroll