సంబంధం లేని ఎప్పటివో పాత ఫోటోలు పెట్టి బిచ్చగాళ్ల వేషం లో వచ్చి చంపి అవయవాలు అమ్ముకుంటున్నారు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు

“ఒరిస్సా నుంచి ఈ రోజు అందిన సమాచారం ఏమిటంటే,,,బీహార్ నుంచి జార్ఖండ్ మధ్యలో బిచ్చగాళ్ళ వేషంలో ఒక 500 వందల మంది బయలుదేరారు..మార్గమధ్యంలో ఒంటరిగా దొరికిన వాళ్ళను చంపి మెడికల్ కాలేజీలకు,,మరియు కిడ్నీ ల దందా లకు సరఫరా చేస్తున్నారు…వీరిలో 6,7 మంది పట్టు బడినారు” అంటూ ఒక వార్త సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతోంది. ఇదే మెసేజ్ ని వాట్సాప్ లో, జుగుప్సాకరమైన, అవయవాలు పడి ఉన్న ఒక ఫోటో తో ప్రచారం చేస్తున్నారు. దీంట్లో ఎంత నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్ (దావా): బీహార్ నుండి బిచ్చగాళ్ల వేషం లో ఒక 500 మంది వచ్చి చంపి అవయవాలు అమ్ముకుంటున్నారు.

ఫాక్ట్ (నిజం): సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న ఫోటోలు ఒక దానితో ఒకటి సంబంధం లేనివి మరియు పాతవి. కొన్ని 2018 కర్ణాటక కి సంబందించిన ఫోటోలు. వాట్సాప్ లో వైరల్ అవుతున్న ఫోటో బ్రెజిల్ దేశంలో 2017 లో ఒక జైలులో జరిగిన అల్లర్ల కి సంబంధించింది. కావున సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న వార్తల అబద్దం. పోలీసులు కూడా అటువంటి సంఘటనల గురుంచి ఎక్కడా చెప్పలేదు.

పోస్ట్ లో ఉన్న ఫోటోలు గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చూస్తే, ఒక ఫోటో 2018 కర్ణాటక కి సంబంధించింది అని తెలుస్తుంది. అప్పుడు కూడా పిల్లలను కిడ్నాప్ చేస్తున్నారు అన్న తప్పుడు వార్తలు బాగా వైరల్ అయ్యాయి. అదే సందర్భంలో అవన్నీ తప్పుడు వార్తలు అని 2018 లో కన్నడ వార్త పత్రిక ప్రజావాణి ఒక వార్త రాసింది. ఇవే ఫోటోలు గత 2 సంవత్సరాల నుండి సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి.

వాట్సాప్ లో వైరల్ అవుతున్న జుగుప్సాకరమైన, అవయవాలు పడి ఉన్న, ఒక ఫోటో అసలు మన దేశానికి సంబంధించింది కాదు. బ్రెజిల్ దేశం లో 2017 లో ఒక జైలులో జరిగిన అల్లర్లలో చనిపోయిన వాళ్ళ శవాల కి సంబంధించింది. అప్పట్లోనే బ్రెజిల్ ప్రభుత్వం ఈ సంఘటన మీద విచారణ కూడా చేసి రిపోర్ట్ సబ్మిట్ చేసింది. ఆ రిపోర్ట్ లో ఇప్పుడు మన దేశం లో అని చెప్పి వైరల్ అవుతున్న ఫోటోలు చూడొచ్చు. అలాగే, దీనికి సంబందించిన వీడియోలు 2017 నుంచే యూట్యూబ్ లో ఉన్నాయి. ఇవే ఫొటోలతో ఫిలిప్పీన్స్ దేశంలో కూడా ఇటువంటి వార్తే వైరల్ ఐంది. అప్పుడు, AFP అనే అంతర్జాతీయ వార్త సంస్థ దీన్ని ఫాక్ట్ చెక్ చేసి తప్పుడు వార్త అని ధ్రువీకరించింది.

చివరగా, సంబంధం లేని ఎప్పటివో పాత ఫోటోలు పెట్టి బిచ్చగాళ్ల వేషం లో వచ్చి చంపి అవయవాలు అమ్ముకుంటున్నారు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఈ విషయమై ఒక ప్రెస్ రిలీజ్ చేసారు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?