వీడియోలో బర్త్ డే బంప్స్ తిన్న అబ్బాయి చనిపోలేదు. అది ఒక ఫేక్ న్యూస్.

మిత్రులు బర్త్ డే బంప్స్ (తన్నడం) ఇవ్వడంతో ఒక స్టూడెంట్ మృతి అంటూ ఒక వీడియో ఫేస్బుక్ మరియు ఇతర మాధ్యమాల్లో చాలా వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): తన మిత్రులు బర్త్ డే బంప్స్ ఇవ్వడంతో ప్రాణాలు కోల్పోయిన ఒక స్టూడెంట్.

ఫాక్ట్ (నిజం): వీడియో లో బర్త్ డే బంప్స్ తిన్న అబ్బాయి బ్రతికే ఉన్నాడు. తన మిత్రులు బర్త్ డే నాడు తనను తన్నిన మాట వాస్తవమే కానీ తను మృతి చెందలేదు. కావున పోస్ట్ లో చెప్పింది అబద్దం.

ఫేస్బుక్ లో ప్రజలే కాదు, ఇదే విషయాన్ని తెలుగు లో దాదాపు అన్ని ప్రముఖ వార్తా సంస్థలు (TV9, ABN Andhrajyothy, Namasthe Telangana, News18, V6news, Sakshi, AP24X7, MojoTV, HansIndia) తమ వెబ్ సైట్లలో పోస్ట్ చేసాయి.

ప్రముఖ మాజీ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ ఇదే వీడియో తన ఫేస్బుక్ మరియు ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేసాడు. సెహ్వాగ్ ట్వీట్ కి వచ్చిన రిప్లై లో ఇది ఫేక్ న్యూస్ అని, ఆ అబ్బాయి బ్రతికే ఉన్నాడని, తనతో కాలేజీలో చదువుతున్న Dr RAGHURAJ SINGH ట్వీట్ చేసిన తరువాత సెహ్వాగ్ తన పోస్ట్ మరియు ట్వీట్ డిలీట్ చేసాడు.

ఈ విషయం గురించి గూగుల్ లో ‘Boy died due to birthday bumps’  అని వెతికితే, ఇండియా టుడే ఇదే విషయం పై ఇంగ్లీష్ లో రాసిన ఫాక్ట్ చెక్ ఆర్టికల్ ఒకటి సెర్చ్ రిజల్ట్స్ లో వస్తుంది.  దాని ప్రకరం వీడియో లో బర్త్ డే బంప్స్ తింటున్న వ్యక్తి Kyrgyzstan దేశ రాజధాని Bishkek లోని ఒక కాలేజీ స్టూడెంట్. ఇండియా టుడే వారు అతనితో మాట్లాడినప్పుడు అతనికి ఏమి కాలేదని, తను చనిపోయడంటూ వైరల్ అవుతున్న వార్తల్లో నిజం లేదని చెప్పాడు.

చివరగా, వీడియోలో బర్త్ డే బంప్స్ తిన్న అబ్బాయి చనిపోలేదు. అది ఒక ఫేక్ న్యూస్.

ప్రతి వారం, మేము ‘ఏది ఫేక్, ఏది నిజం’ అనే తెలుగు యూట్యూబ్ షో చేస్తున్నాం. మీరు చూసారా?