Fake News, Telugu
 

బీరు కావాలంటూ కేసీఆర్ కి రాసిన లేఖ బ్యాలట్ బాక్సు లో దొరకలేదు

0

జగిత్యాల లో జరిగిన స్థానిక ఎన్నికల్లో ఒక వ్యక్తి తమ జిల్లాలో బీరు దొరకట్లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఉద్దేశిస్తూ రాసిన లేఖ బ్యాలట్ బాక్సు లో దొరికింది అని చెప్తూ ఒక లేఖ ఫోటోను ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): జగిత్యాల జిల్లాలో కింగ్ ఫిషర్ బీర్ దొరకట్లేదని, కరీంనగర్ లో దొరుకుంతుంది కాబట్టి ఆ జిల్లాలో తమ జిల్లాని కలిపెయమంటూ ఒక వ్యక్తి కేసీఆర్ కి వినతి పత్రం రాసి బ్యాలట్ బాక్సులో వేసాడు.

ఫాక్ట్ (నిజం): రోడ్డు కావాలంటూ బ్యాలట్ బాక్సులో లేఖ దొరికింది కానీ కింగ్ ఫిషర్ బీరు మీద ఎటువంటి లేఖ దొరకలేదని జగిత్యాల జాయింట్ కలెక్టర్ తెలిపారు. వైరల్ అవుతున్న వార్తలో ఎటువంటి నిజం లేదని చెప్పారు. కావున పోస్ట్ లో చెప్పింది అబద్ధం.

పోస్ట్ లో ఉన్న వార్త గురించి గూగుల్ లో వెతకగా, సోషల్ మీడియా లో ప్రజలే కాదు ప్రముఖ వార్తా సంస్థలు కూడా ఇదే వార్తను ప్రచురించాయని తెలుస్తుంది. వాటిల్లో కొన్నిటిని ఇక్కడ చూడొచ్చు. (టైమ్స్ అఫ్ ఇండియా – సమయం, 10టీవీ, న్యూవేవ్స్, ABNఆంధ్రజ్యోతి, 99టీవీ, News18, టీవీ9, మన తెలంగాణ, NTV ).

పోస్ట్ లోని లేఖ లో రాసిన విషయం మీదనే గత సంవత్సరం జగిత్యాల లో కలెక్టర్ కి ఒక వ్యక్తి కింగ్ ఫిషర్ బీర్ల కొరత మీద ఫిర్యాదు చేసినట్టు ఆసియా నెట్ న్యూస్ ఆర్టికల్ లో చూడొచ్చు. కాకపోతే ఆ లేఖ, ఇప్పుడు వైరల్ అవుతున్న లేఖలు ఒక్కటి కాదు. బ్యాలట్ బాక్సు లో వేసినట్లయితే పేపర్ మడత పెట్టి వేయాలి. కానీ పోస్ట్ లోని లేఖ సరిగ్గా చూస్తే అది ఒక నోట్ బుక్ పేపర్ మీద రాసినట్టు చూడొచ్చు.

నిజంగా అలాంటి లేఖ ఏమైనా బ్యాలట్ బాక్సు లో దొరికిందా అని తెలుసుకోవడానికి FACTLY జగిత్యాల జాయింట్ కలెక్టర్ కి ఫోన్ చేసి మాట్లాడగా, వైరల్ అవుతుంది ఫేక్ న్యూస్ అని తెలిసింది. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రోడ్ల విషయం పై ఒక లేఖ బ్యాలట్ బాక్సులో దొరికింది అనేది వాస్తవమే, కానీ కింగ్ ఫిషర్ బీర్ల గురించి ఎటువంటి లేఖ బ్యాలట్ బాక్సు లో దొరకలేదని చెప్పారు. కావున సోషల్ మీడియా మరియు వివిధ వార్తా పత్రికల్లో వైరల్ అవుతున్న పోస్ట్ లో నిజం లేదు.

చివరగా, బీరు కావాలంటూ కేసీఆర్ కి రాసిన లేఖ బ్యాలట్ బాక్సు లో దొరకలేదు. అది ఒక ఫేక్ న్యూస్.

ఎలక్షన్ కౌంటింగ్ ఎట్లా జరుగుతుందో మీకు తెలుసా? ఈ వీడియో చుడండి

Share.

About Author

Comments are closed.

scroll