ప్రధాని మోడీని ఒక డ్రాకులా లాగా చిత్రీకరించి JNU మరియు AMU లలో విద్యార్థులు పోస్టర్ పెట్టలేదు

ప్రధానమంత్రి మోడీని ఒక డ్రాకులా లాగా చిత్రీకరించి JNU (జవహర్ లాల్ నెహ్రు యూనివర్సిటీ) లో పోస్టర్ పెట్టారని చెప్తూ ఉన్న ఒక పోస్ట్ ని సోషల్ మీడియా లో చాలా మంది షేర్ చేస్తున్నారు. పోస్ట్ మొత్తం చదివితే, తెలుగు లో రాసిన దాంట్లో ఆ పోస్టర్ JNU లో పెట్టిన్నట్టు చెప్తారు, కానీ హిందీ లో రాసిన దాంట్లో ఆ పోస్టర్ AMU (అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ) లో పెట్టినట్టు చెప్తారు. కావున ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ : ప్రధాని మోడీని ఒక డ్రాకులా లాగా చిత్రీకరించి JNU/AMU లో పోస్టర్ పెట్టారు.       

ఫాక్ట్ (నిజం): ఫోటోలోని పోస్టర్ ని లండన్ లో ఇండియన్ హై కమిషన్ ముందు కాశ్మీర్ పై మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా జరిగిన నిరసన లో చూడవచ్చు. అంతే కాదు, AMU లో ఈ పోస్టర్ పెట్టినట్టు వచ్చిన వార్తలు తప్పు అని చెప్తూ అలీఘర్ పోలీసులు ట్వీట్ కూడా చేసారు. కావున, పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లోని విషయం గురించి వెతకగా, తెలుగులో JNU లో ఈ పోస్టర్ పెట్టినట్టు వైరల్ అవ్వకముందే AMU లో ఈ పోస్టర్ పెట్టినట్టు మిగితా బాషలల్లో ఈ పోస్టర్ చాలా వైరల్ అయింది. ట్విట్టర్ లో ఒక వ్యక్తి పోస్ట్ లోని ఫోటోనే ట్వీట్ చేయగా, దానికి సమాధానమిస్తూ AMU లో మోడీ ని డ్రాకులా లాగా చిత్రీకరించి పోస్టర్ పెట్టారని వస్తున్న వార్తలు అబద్ధం అని అలీఘర్ పోలీసులు ట్వీట్ చేసారు. మరొక వ్యక్తి పోస్ట్ లోని పోస్టర్ ని పెట్టి, ఫోటోని ఆగష్టు 15న లండన్ లోని ఇండియన్ హై కమిషన్ దగ్గర జరిగిన బ్లాక్ డే నిరసన లో తీసినట్టు ట్వీట్ చేసింది.

ఆ పోస్టర్ కొరకు ఇండియన్ హై కమిషన్ దగ్గర ఆగష్టు 15న జరిగిన నిరసనలో వెతకగా, యూట్యూబ్ లో ‘The Sun’ వారు ‘Kashmir protests outside London’s Indian High Commission’ అనే టైటిల్ తో అప్లోడ్ చేసిన వీడియోలో 46 నిమిషాల 09 సెకండ్ల దగ్గర పోస్ట్ లో ఉన్న పోస్టర్ ని చూడవచ్చు.

లండన్ లో జరిగిన నిరసన కి సంబంధించిన పోస్టర్ ఫోటోని తీసుకొని JNU మరియు AMU విశ్వవిద్యాలయల్లో పెట్టినట్టు తప్పుగా ప్రచారం చేస్తున్నారు. 

చివరగా, ప్రధాని మోడీని ఒక డ్రాకులా లాగా చిత్రీకరించి JNU మరియు AMU లలో విద్యార్థులు పోస్టర్ పెట్టలేదు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?