నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా ప్రపంచ బ్యాంకు నుండి 2014-16 మధ్య అప్పులు తీసుకుంది

నరేంద్ర మోడీ మాత్రమే  ప్రపంచ బ్యాంకు నుండి అప్పులు చెయ్యకుండా పాత అప్పులు తిరిగి చెల్లించాడని సంఖ్యలతో కూడిన ఒక ఫోటోని  ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ సంఖ్యలలో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ  చూడవచ్చు

క్లెయిమ్ (దావా): మునపటి ప్రధానులు World Bank నుంచి అప్పులు తీసుకుంటే, కేవలం మోడీ మాత్రమే అప్పు చెయ్యకుండా పాత అప్పులు తిరిగి చెల్లించాడు.   

ఫాక్ట్ (నిజం): లోక్ సభలో ఆర్ధిక శాఖ సహాయక మంత్రి చెప్పిన సమాధానం ప్రకారం నరేంద్ర మోడీ ప్రభుత్వం 2014-2016 మధ్య ప్రపంచ బ్యాంకు నుండి 447.714 కోట్ల అమెరికా డాలర్లు అప్పు తీసుకుంది, మరియు కేవలం 408.965 కోట్ల డాలర్ల రుణం తీర్చింది. కావున పోస్ట్ లో చెప్పిన దాంట్లో నిజము లేదని తెలుస్తుంది.

గూగల్ లో భారత దేశం ప్రపంచ బ్యాంకు నుండి తీసుకున్న అప్పుల గురించి వెతకగా జులై 20, 2018 వ తేదీన లోక్ సభలో ఆర్ధిక శాఖ సహాయక మంత్రి పొన్ రాధా కృష్ణన్ చెప్పిన సమాధానం దొరుకుంతుంది. దాని ప్రకారం నరేంద్ర మోడీ ప్రభుత్వం 2014-2016 మధ్య  ప్రపంచ బ్యాంకు నుండి 447.714 కోట్ల అమెరికా డాలర్లు అప్పు తీసుకుంది, మరియు కేవలం 408.965 కోట్ల డాలర్ల అప్పు తీర్చింది.

నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి కాక ముందు వరకు, అంటే 2014 మార్చి నాటికి, భారత దేశం ప్రపంచ బ్యాంకు కు ఉన్న మొత్తం అప్పుల విలువ 3564.599 కోట్ల అమెరికా డాలర్లు. 2016 మర్చి నాటికి నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు కు ఉన్న అప్పుల విలువ 3383.710 కోట్ల అమెరికా డాలర్లు కు తగ్గింది. అది 2018 మార్చి నాటికి 3428.516 కోట్ల అమెరికా డాలర్లకు పెరిగింది.

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో 2004-2014 మధ్య 2019.704 కోట్లా అమెరికా డాలర్లు అప్పుగా తీసుకున్నారు మరియు ప్రపంచ బ్యాంకు కు తిరిగి తీర్చిన అప్పు 1140.042  కోట్లా అమెరికా డాలర్లు. కానీ ఫొటోలో ఇచ్చిన సమాచారంలో ఇది కూడా తప్పుగా ఇవ్వబడింది

Source: లోక్ సభ

ప్రపంచ బ్యాంకు భారత దేశంలోని ప్రాజెక్టులకు ఇస్తున్న అప్పులు మరియు ఇతర వివరాలు ఇక్కడ చూడవచ్చు

చివరగా, పోస్ట్ లోని సంఖ్యలు తప్పు. పోస్ట్ లో చెప్పినట్టుగా కేవలం నరేంద్ర మోడీ మాత్రమే అప్పులు చేయకుండా పాత అప్పులు తిరిగి చెల్లించాడనే దాంట్లో నిజం లేదు.