Fake News, Telugu
 

గుంటూరు జిల్లాలో గత సంవత్సరం జరిగిన ఒక ఘటనకు చెందిన ఫోటోని, ప్రస్తుతం తప్పుడు ఆరోపణలతో ప్రచారం చేస్తున్నారు

0

ఫేస్బుక్ లో ఒక చిత్రంతో కూడిన పోస్ట్ ని చాలా మంది పోస్ట్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత  జగిత్యాలలోని హాబ్సీ పూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన భోజనాన్ని దళిత కార్యకర్త తిన్నందుకు గాను అదే పార్టీకి చెందిన అగ్రకుల కార్యకర్తలు అతని పై దాడి చేసి కొట్టారు అంటూ ఆరోపణ చేశారు. ఈ పోస్ట్ లో పెట్టిన విషయాలు ఎంతవరకు నిజమో ఓసారి విశ్లేషిద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్చివ్డ్ వెర్షన్ ఇక్కడ చూడొచ్చు.

క్లెయిమ్ (దావా): జగిత్యాలలోని హాబ్సీ పూర్ గ్రామంలో తెరాస పార్టీ వారు ఏర్పాటు చేసిన భోజనాన్ని ఒక దళిత కార్యకర్త తిన్నందుకు గాను అదే పార్టీకి చెందిన అగ్రకుల కార్యకర్తలు అతని పై దాడి చేసి కొట్టారు

ఫాక్ట్ (నిజం): పోస్ట్ లో ఉన్న చిత్రం గత సంవత్సరం (2018) మార్చ్ లో గుంటూరు జిల్లాలోని పాస్టర్ కి మరియు మరొకరికి  జరిగిన ఘర్షణకి సంబంధించినది. ఫేస్బుక్ పోస్ట్ లో పేర్కొన్నట్టుగా ఆ ఫోటోకి మరియు తెలంగాణ లో జరిగిన సంఘటన కి ఎటువంటి సంబంధం లేదు. కావున పైన చేసిన ఆరోపణ తప్పు.

ఫేస్బుక్ పోస్ట్ లో ఉన్న ఫోటోని గూగుల్  రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, దానిని ఏప్రిల్ 9, 2018న MORNING STAR NEWS వారు ప్రచురించిన ఒక ఆర్టికల్ లో లభించింది. దాని కథనం ప్రకారం ఆ ఫోటో, గుంటూరు జిల్లాలోని రెంటిచింతల గ్రామంలోని  పాస్టర్ కి మరియు ఒక గుర్తు తెలియని వ్యక్తి కి జరిగిన ఘర్షణకి సంబంధించినదని తెలుస్తుంది. ఈ ఘటన గురించి వార్తా పత్రిక ‘ఆంధ్రజ్యోతి’  కూడా మార్చ్ 31, 2018 న ఓ కథనాన్ని ప్రచురించింది.

ఈ విషయం గురించి ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ వారి వెబ్సైటు లో వెతికినప్పుడు, ఆ ఘటన పై  మార్చ్ 30, 2018 న నమోదైన కేసు FIR(రెంటిచింతల పోలీస్ స్టేషన్ FIR: 32/2018)  కాపీ లభించింది. FACTLY వారు మరింత సమాచారానికై ఆ స్టేషన్ ఎస్. ఐ. హరిబాబు గారిని సంప్రదించినప్పుడు  “రెంటిచింతల గ్రామం లోని పాస్టర్ మాదిరి కోటి రెడ్డి వారి ఊరిలో క్రైస్తవ మతాన్ని బోధిస్తున్న కారణంగా ఆగ్రహించిన శివయ్య అనే వ్యక్తి అతని పై గొడ్డలితో దాడి చేశారు” అని ఆయన తెలియజేసారు.

చివరగా, గుంటూరు జిల్లాలో జరిగిన ఒక సంఘటనకు చెందిన ఫోటోని, ప్రస్తుతం తెరాస కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణకి సంబంధించిన చిత్రంగా తప్పుడు ఆరోపణలతో  ప్రచారం చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll