కాలిఫోర్నియా ప్రభుత్వం బైబిల్ ని నిషేధించలేదు

కాలిఫోర్నియా లో బైబుల్ ని నిషేధిస్తూ అసెంబ్లీలో తీర్మానం…ప్రతి ఒక్కరూ షేర్ చేయండి. బైబుల్ లో Sexual Topiks ఎక్కువగా ఉన్నాయని, బైబుల్ ని చిన్నపిల్లలు చదవటం మంచిది కాదని, బైబుల్ చదవటంవల్ల పెద్దవాళ్ళలో కూడా Sexual harassments ఎక్కువ అవుతున్నాయని బైబుల్ ని నిషేధించిన కాలిఫోర్నియా ప్రభుత్వం” అంటూ ఫేస్బుక్ లో కొంతమంది పోస్ట్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో పేర్కొన్న విషయాల్లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): కాలిఫోర్నియా ప్రభుత్వం బైబుల్ ని నిషేధించింది .

ఫాక్ట్ (నిజం): ఒక రిపబ్లికన్ రాజకీయ నాయకుడు మరియు ఇంకొక టీ.వీ న్యూస్ ఛానల్ కలిసి కాలిఫోర్నియా AB 2943 బిల్లు ని తప్పుగా చూపించారు. ఆ బిల్లు వాస్తవానికి లైంగిక ధోరణి మార్పు ప్రయత్నాల యొక్క ప్రకటనలను మరియు అమ్మకాలను నిషేధించడానికి సంబంధించినది. ఆ బిల్లులో అసలు ఎక్కడా కూడా బైబిల్ గురుంచి ప్రస్తావించలేదు. కావున, పోస్ట్ లో పేర్కొన్న విషయాల్లో నిజం లేదు.  

కాలిఫోర్నియా ప్రభుత్వం బైబుల్ ని నిషేధించిందా? అనే విషయం గురించి వెతికినప్పుడు, ఇలాంటి వార్తలు ఏప్రిల్ 2018లో కాలిఫోర్నియా అసెంబ్లీలో ఒక సభ్యుడు (Evan Low) AB 2943 బిల్లుని ప్రవేశ పెట్టినప్పుడు వచ్చాయని తెలిసింది. ఆ బిల్లు వాస్తవానికి లైంగిక ధోరణి మార్పు ప్రయత్నాల యొక్క ప్రకటనలను మరియు అమ్మకాలను నిషేధించడానికి సంబంధించినది. కానీ, ఒక రిపబ్లికన్ రాజకీయ నాయకుడు Travis Allen మరియు ‘One America News Network (OAN)’ అనే న్యూస్ ఛానల్ కలిసి ఆ బిల్లు ని తప్పుగా చూపించారు. ఆ  వీడియోలో టీ.వీ. ఛానల్ వ్యాఖ్యాత కాలిఫోర్నియా అసెంబ్లీ సభ్యుడు Travis Allen ని AB 2943 బిల్లుని అసెంబ్లీలో ఆమోదిస్తే లైంగిక నైతికత గురించి చెప్పే ‘బైబిల్’ ని కూడా నిషేధిస్తారా అని అడిగినప్పుడు, అతను అవును అని సమాధానం ఇస్తూ ప్రసంగించారు. ఆ ఛానల్ ఆ వీడియోని తమ ఫేస్బుక్ అకౌంట్ లో  పోస్ట్ చేసినప్పటి నుండి బైబిల్ బాన్ గురించి చర్చ మొదలయింది.  కానీ, AB 2943 బిల్లుని చూసినట్లయితే అందులో అసలు ఎక్కడా కూడా బైబిల్ గురించి ప్రస్తావన జరగలేదని చూడవచ్చు.

Evan Low తాను ప్రవేశపెట్టిన బిల్లు గురించి తప్పుడు ప్రచారం జరుగుతుందనే విషయం  తెలుసుకుని, ఆ బిల్లు లోని విషయాలను గురించి తెలుపుతూ ట్విట్టర్ లో ఒక వీడియో ని పెట్టాడు. దాంట్లో, AB 2943 బిల్లు ఆమోదం జరిగితే బైబిల్ ని ప్రభుత్వం నిషేద్ధిస్తుంది అనేది అవాస్తవం అని స్పష్టంగా చెప్పాడు. దీనికి సంబంధించి “The Washington Times” ప్రచురించిన కథనం కూడా లభించింది.

ప్రస్తుతం AB 2943 బిల్లు స్థితిని తెలుసుకోడానికి ప్రయత్నించినప్పుడు “Los Angeles Times” పత్రిక ఆగష్టు 31, 2018న  ప్రచురించిన కథనం లభించింది. Evan Low కి అనేక మతాల వారు ఆ బిల్లు ఆమోదం జరిగితే తమ హక్కులకు ఆటంకం కలుగుతుందని తెలుపడంతో దానిని అసెంబ్లీ నుండి తుది ఆమోదం రాకముందే వెనక్కి తీసుకునట్లుగా తెలిసింది.

అంతే కాదు, ఇదే విషయం మీద అమెరికా కి చెందిన అనేక ఫాక్ట్ చెక్ సంస్థలు, బైబిల్ నిషేధం అబద్ధం అని కూడా రాశాయి. ఫాక్ట్ చెక్, పొలిటి ఫాక్ట్, స్నోప్స్ వంటి సంస్థలన్నీ దీనిలో నిజం లేదు అని 2018 లోనే చెప్పాయి.

చివరగా, కాలిఫోర్నియా ప్రభుత్వం బైబిల్ ని నిషేధించిందనేది అవాస్తవం. 

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?