కన్నయ్య కుమార్ 12 ఏళ్ళ గా జే.ఎన్.యు లో పరిశోధన చేస్తున్నాడు అంటూ వస్తున్న పోస్ట్ లలో నిజం లేదు

కన్నయ్య కుమార్ చాలా ఏళ్ళగా జే.ఎన్.యు లో ఉంటూ ప్రజలు ప్రభుత్వానికి కట్టే పన్నుల తో వచ్చే సబ్సిడీలు తీసుకుంటూ అనవసరమైన పరిశోధన చేస్తున్నాడంటూ ఫేస్బుక్ లో ఒక పోస్ట్ ని కొందరు షేర్ చేస్తున్నారు . ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): కన్నయ్య కుమార్ ఒక వృద్ధ విద్యార్థి. 2002 లో 12వ తరగతి పాస్ అయిన తను, 2017 లో కూడా జే.ఎన్.యు లో ఆఫ్రికా లో ఉడతలు పట్టేవారి మీద పరిశోధనలు చేస్తున్నాడు.

ఫాక్ట్ (నిజం): 2011 లో జే.ఎన్.యు (M.Phil-Ph.D ఇంటిగ్రేటెడ్ కోర్సు) లో జాయిన్ అయిన తను 2019 లో Ph.D పూర్తి చేసాడు. కోర్సు సమయం లో UGC వారు ఇచ్చే ఫండింగ్ తనకు కూడా వచ్చింది. తను ‘ Social Transformation in South Africa,1994-2015’ అనే టాపిక్ మీద Ph.D లో పరిశోధన చేసాడు. కావున పోస్ట లో చెప్పినట్టుగా ఏళ్ళ తరబడి జే.ఎన్.యు లో పరిశోధన చేస్తున్నాడనేది తప్పు.

కన్నయ్య కుమార్ జే.ఎన్.యు లో Ph.D పరిశోధన ఎప్పుడు మొదలు పెట్టాడో తెలుసుకోవడానికి జే.ఎన్.యు వెబ్ సైట్ లో వెతికితే తను 2013 లో Ph.D కోర్సు లో అడ్మిట్ అయినట్టు తెలుస్తుంది. అంతకు ముందు రెండేళ్ళు (2011-2013) జే.ఎన్.యు లో తను M.Phil పూర్తి చేసాడు. తను జే.ఎన్.యు లోని స్కూల్ అఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ కి సంభందించిన సెంటర్ ఫర్ ఆఫ్రికన్ స్టడీస్ స్టూడెంట్ అవ్వడం తో Ph.D లో ‘Social Transformation in South Africa,1994-2015’ అనే టాపిక్ మీద పరిశోధన చేసాడు. వేరే Ph.D స్టూడెంట్స్ కి వచ్చినట్టు తనకు కూడా UGC ఫండింగ్ వచ్చింది.


అంతే కాకుండా తను ఫెయిల్ అవుతూ ఏళ్ళ తరబడి జే.ఎన్.యు లో ఉంటున్నట్టుగా వస్తున్న వార్తలపై కన్నయ్య కుమార్ ABP న్యూస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో వివరణ ఇచ్చాడు. జే.ఎన్.యు లో M.Phil-Ph.D ఇంటిగ్రేటెడ్ కోర్సు ఏడేళ్ళు ఉంటుందని, తను 2011 లో జాయిన్ అయ్యాడు కాబట్టి 2018 వరకు పరిశోధన రిపోర్ట్ ఇచ్చేందుకు సమయం ఉందని తను చెప్పారు. Feb 14న, 2019 తను Ph.D వైవా పాస్ అయ్యినట్టుగా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ట్వీట్ చేసాడు.

చివరగా, కన్నయ్య 12 ఏళ్ళ గా జే.ఎన్.యు లో పరిశోధన చేస్తున్నాడు అంటూ వస్తున్న పోస్ట్ లల్లో నిజం లేదు.