గత ఐదేళ్ళ మోడీ ప్రభుత్వం లో కూడా భారతదేశంలో కాశ్మీర్ దాటి ఉగ్రవాద దాడులు జరిగాయి

గడిచిన ఐదేళ్లలో అసలు కాశ్మీర్ దాటి ఉగ్రవాద దాడులే జరగకుండా చూసుకున్న మోడీనే మళ్ళీ ఓటు వేసి గెలిపించుకుందాం అంటూ ఒక పోస్ట్ ని చాలా మంది ఫేస్బుక్ లో షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): గత ఐదేళ్ళ మోడీ ప్రభుత్వంలో కాశ్మీర్ దాటి ఉగ్రవాద దాడులు జరగలేదు.

ఫాక్ట్ (నిజం): లోక్ సభ లో ప్రభుత్వం ఇచ్చిన సమాధానాల ప్రకారం గత ఐదేళ్ళ లో కూడా ఉగ్రవాదులు కాశ్మీర్ దాటి భారతదేశంలో దాడులు చేసారు. ఉదాహరణకి పంజాబ్ లోని పఠాన్‌కోట్‌ ఎయిర్ బేస్ మీద జరిగిన ఉగ్రవాద దాడి తీసుకోవచ్చు. కావున పోస్ట్ లో తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.

భారతదేశం లో గత ఐదేళ్ళ లో జరిగిన ఉగ్రవాద దాడులు తెలుసుకోవడానికి లోక సభ సమాధానాలు వెతకగా హోం శాఖ లోని మినిస్టర్ అఫ్ స్టేట్ హంస్రాజ్ గంగారాం అహిర్ 5th ఫిబ్రవరి, 2019 రోజున లోక్ సభ లో ‘Unstarred question no. 400’ కి ఇచ్చిన సమాధానం దొరుకుంతుంది. దాని ప్రకారం 2014-2018 సంవత్సరాలలో భారతదేశంలో కాశ్మీర్ దాటి ఆరు ఉగ్రవాద దాడులు జరిగాయి. అదనంగా జమ్మూ & కాశ్మీర్ లో 1708 ఉగ్రవాద సంఘటనలు జరిగాయి. ఇవ్వని కేవలం ఉగ్రవాద దాడులే. ఇవి కాకుండా నక్సల్ మరియు ఈశాన్య రాష్ట్రాల మిలిటన్సి దాడులు అదనంగా జరుగుతుంటాయి.

హోం శాఖ భారతదేశంలో జరిగిన ఉగ్రవాదుల దాడుల గురించి 2015 లో లోక్ సభ లో ఇచ్చిన సమాధానం ప్రకారం మోడీ ప్రభుత్వ హయాంలో బెంగళూరు, బుర్ద్వాన్ మరియు గుర్దాస్పూర్ లో ఉగ్రవాద దాడులు జరిగినట్టుగా చూడవచ్చు. అంతే కాకుండా 2016 లో పంజాబ్ లోని పఠాన్‌కోట్‌ ఎయిర్ బేస్ మీద కూడా దాడి జరిగింది.

అలానే, సౌత్ ఆసియన్ టెర్రరిజం పోర్టల్ తమ వెబ్ సైట్ లో ప్రచురించిన సమాచారం చూస్తే ఏటా రెండు వేలకు పైగా ఉగ్రవాదానికి సంభందించిన సంఘటనలు భారతదేశంలో జరుగుతున్నయని తెలుస్తుంది.  కావున మోడీ ప్రభుత్వం లో అసలు కాశ్మీర్ దాటి ఉగ్రవాద దాడులే జరగనట్టుగా పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.

చివరగా, గత ఐదేళ్ళ మోడీ ప్రభుత్వం లో కూడా భారతదేశంలో కాశ్మీర్ దాటి ఉగ్రవాద దాడులు జరిగాయి.