ఇందిరా గాంధీ కిరణ్ బేడీకి భోజనం పెట్టించింది తన వాహనాన్ని తనిఖీ చేసినప్పుడు కాదు

తన కారుని తనిఖీ చేసిన పోలీస్ ఆఫీసర్ ని మెచ్చుకొని భోజనానికి ఇంటికి పిలిచిన ఇందిరా గాంధీ అంటూ ఒక ఫోటో ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. పోస్ట్ లో భోజనం చేసే ఫోటో పెట్టి ఇందిరా గాంధీ సంఘటనని, మోడీ హెలికాప్టర్ వెతికినందుకు సస్పెండ్ అయిన IAS ఆఫీసర్ సంఘటన తో పోలుస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): గతంలో ఎన్నికల్లో ఇందిరా వాహనాన్ని తనిఖీ చేసిన కిరణ్ బేడీని మెచ్చుకొని ఇంటికి పిలిచి భోజనం పెట్టి సత్కరించిన ఇందిరా గాంధీ.

ఫాక్ట్ (నిజం): ఇందిరా గాంధీ వాహనాన్ని ఎన్నికల్లో కిరణ్ బేడీ తనిఖీ చేయలేదు. 1982 లో ప్రధాన మంత్రి ఆఫీస్ (పీఎంఓ) కార్ తప్పుగా పార్కింగ్ చేసి ఉంటే ఢిల్లీ పోలీస్ వారు చలాన్ వేసారు. అప్పుడు బేడీ ఢిల్లీ పోలీస్ డీ.సీ.పీ గా పనిచేస్తుండేవారు. కానీ పోస్ట్ లో ఉన్న ఫోటో 1975 లో కిరణ్ రిపబ్లిక్ డే పెరేడ్ లీడ్ చేసినందుకు ఇందిరా గాంధీ తనను భోజనానికి పిలిచినప్పుడు తీసినది. కావున పోస్ట్ లో రెండు వేర్వేరు సంఘటనలు ఒకటిగా చూపిస్తూ తప్పుదోవ పట్టిస్తున్నారు.

పోస్ట్ లోని ఇందిరా-కిరణ్ బేడీ ల ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతికితే, ట్విట్టర్ లో కిరణ్ బేడీ ఇదే ఫోటోని గత సంవత్సరం ఇందిరా గాంధీ జయంతి రోజున ట్వీట్ చేసినట్టుగా చూడవచ్చు. ఆ ట్వీట్ లో ఫోటోని 1975 లో తీసినట్టుగా రాసింది.

ఇందిరా గాంధీ – కిరణ్ బేడీ ల కార్ సంఘటన గురించి గూగుల్ లో వెతికితే, ఆ సంఘటన మీద వివిధ వార్తా పత్రికలు రాసిన ఆర్టికల్స్ సెర్చ్ రిజల్ట్స్ లో వస్తాయి. వాటిల్లో NDTV ఆర్టికల్ ప్రకారం 1982 లో ప్రధాన మంత్రి ఆఫీస్ కి చెందిన కారుకి ఢిల్లీ పోలీసు వారు చలాన్ వేసారు. అప్పుడు ఢిల్లీ పోలీసు డిప్యూటీ కమీషనర్ గా కిరణ్ బేడీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పోస్ట్ లో ఉన్న ఫోటో 1975 లో తీయగా, ప్రధానమంత్రి కారు సంఘటన 1982 లో జరిగింది.

కావున పోస్ట్ లోని ఫోటోని తప్పుగా ఉపయోగిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.